తెలుగు సినీ నటి ప్రత్యూష మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నప్పటికీ, తన కూతురికి పూర్తి న్యాయం జరిగిందని మాత్రం నమ్మలేనని ఆమె భావోద్వేగంగా తెలిపారు. “ఇది సహజ మరణం కాదు. నా కూతురిని కిరాతకంగా చంపేశారు. కీలక సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారు” అని ఆరోపించారు.
పూర్తి ఆధారాలు వెలుగులోకి వచ్చి ఉంటే నిందితుడికి ఖచ్చితంగా జీవిత ఖైదు విధించబడేదని ఆమె అభిప్రాయపడ్డారు. మునిస్వామి నివేదికను కోర్టులు పరిగణలోకి తీసుకోలేదని, త్రిసభ్య కమిటీ నివేదికకే ప్రాధాన్యం ఇచ్చారని ఆమె విమర్శించారు. అసలు నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని కూడా ఆమె ఆరోపించారు. “నా కూతురు మృతదేహాన్ని కూడా నేను చూడలేదు. ప్రభుత్వ పరంగా మా కుటుంబానికి న్యాయం చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో మొదటగా నాంపల్లిలోని స్థానిక కోర్టు నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలుకు పెంచింది. శిక్ష తగ్గింపుపై అప్పట్లోనే సరోజినీ దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ALSO READ : నటి ప్రత్యూష కేసు : నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు
2012లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అప్పటి నుంచి కేసు వివిధ దశల్లో విచారణ కొనసాగుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి కఠిన శిక్ష విధించాలని ఆమె నిరంతరం డిమాండ్ చేస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటంలో తాజా తీర్పుతో మరో అధ్యాయం ముగిసినప్పటికీ, తమకు సంపూర్ణ న్యాయం ఇంకా అందలేదని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
