
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు బెదిరింపు లేఖ వచ్చింది. ముంబైలోని తన నివాసానికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ వచ్చింది. దీంతో ఆమె వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిపారు. హిందీలో రాసిన ఈ లేఖలో స్వర భాస్కర్‌కు ప్రాణ హాని తలపెడతామని హెచ్చరించారు. ఆంతేకాకుండా. లేఖ చివరిలో ఇట్లు ఈ దేశ యువకులు అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో స్వర భాస్కర్ చాలా యాక్టీవ్ గా ఉంటారు. సమాజంలో జరిగే సామాజిక రాజకీయ అంశాలపై ఆమె చురుకుగా స్పందిస్తారు. జైలు నుంచి విడిచిపెట్టాలని వేడుకుంటూ సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారని ఆయన వీరుడు ఎంతమాత్రం కాదని 2017లో స్వర భాస్కర్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపింది. వీర్ సావర్కర్ పిరికివాడని పేర్కొంటూ 2019లోనూ ఆమె ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈ బెదిరింపు లేఖ వచ్చినట్టుగా తెలుస్తోంది.