హైదరాబాద్: హీరోయిన్ టీనా శ్రావ్య మేడారంలో తన పెంపుడు కుక్క తులాభారం వేసి బంగారాన్ని (బెల్లం) సమర్పించిన విషయం తెలిసిందే. శక్తివంతమైన సమ్మక, సారలమ్మల దగ్గర కుక్క తులాభారం సమర్పించడం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఈ చర్య వన దేవతలను అవమానించడమేనని నటిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతుండటంతో దీనిపై ఎట్టకేలకు నటి టీనా శ్రావ్య స్పందించింది.
ఈ మేరకు క్షమాపణలు చెబుతూ బుధవారం (జనవరి 21) ఓ ఆడియో రిలీజ్ చేసింది. తన పెంపుడు కుక్కకి ట్యూమర్ సర్జరీ అయిందని.. అది కోలుకోవాలని అమ్మవారికి మొక్కామని చెప్పింది. ఇందులో భాగంగా భక్తితో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నామని వివరణ ఇచ్చింది. ఎవరినీ కించపర్చాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పింది. తెలియక జరిగిన తప్పుకు తనను క్షమించాలని.. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని క్షమాపణలు కోరింది.
►ALSO READ | హనుమకొండ అడిషనల్ కలెక్టర్ పై ఏసీబీ కేసు
తాను సంప్రదాయాలను గౌరవిస్తూనే ఉంటానని తెలిపింది. కాగా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర 2026, జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. జాతర సమయంలో భారీ రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు ముందుగానే వెళ్లి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మహా జాతరకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
