అదానీ భారీ ఐపీఓ..ఈ నెలాఖరులోనే ఉండే ఛాన్స్​?

అదానీ భారీ ఐపీఓ..ఈ నెలాఖరులోనే ఉండే ఛాన్స్​?

ముంబై: అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ తన ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్​ (ఎఫ్​పీఓ) కోసం స్టాక్​ ఎక్స్చేంజీల వద్ద పేపర్లు ఫైల్​ చేసింది. ఈ ఫాలో ఆన్​ ఐపీఓ ద్వారా రూ. 20 వేల కోట్లను సమీకరించాలనేది అదానీ ఎంటర్​ప్రైజస్​ ప్లాన్. జనవరి చివరి వారంలో ఫాలో ఆన్​ ఐపీఓ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కానీ, అదానీ గ్రూప్​ అధికార ప్రతినిధి మాత్రం స్పందించలేదు. ఫాలోఆన్​ ఐపీఓకి రానున్నట్లు కిందటి ఏడాది నవంబర్​లోనే అదానీ గ్రూప్​ ప్రకటించింది. పార్ట్​లీ పెయిడ్​అప్​ షేర్ల జారీ ద్వారా ఫండ్స్​ను అదానీ ఎంటర్​ప్రైజస్​ సేకరించొచ్చని కొంత మంది బ్యాంకర్లు చెప్పారు. ఫాలో ఆన్​ ఐపీఓలో రిటెయిల్​ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్​ ఇచ్చే ఛాన్స్​ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో చూస్తే అదానీ ఎంటర్​ప్రైజస్​ షేరు 94 శాతం ర్యాలీ చేసింది. ఇక అయిదేళ్ల కాలానికి చూస్తే ఏకంగా 1,760 శాతం లాభపడింది. 

తగ్గనున్న ప్రమోటర్ల వాటా..

ఫాలో ఆన్​ ఐపీఓ కోసం మర్చంట్​ బ్యాంకర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్​, ఎస్​బీఐ క్యాపిటల్​, బ్యాంక్​ ఆఫ్ బరోడా క్యాపిటల్​, జేఎం ఫైనాన్షియల్​, ఎలారా క్యాపిటల్​లను అదానీ ఎంటర్​ప్రైజస్​ నియమించుకుంది. ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్​ పూర్తయితే అదానీ ఎంటర్​ప్రైజస్​లో గౌతమ్​ అదానీ సహా ప్రమోటర్ల వాటా 3.5 శాతం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉంది. మిగిలిన 27.37 శాతం వాటాలు పబ్లిక్​ చేతిలో ఉన్నాయి. అదానీ ఎంటర్​ప్రైజస్​లో ఎల్​ఐసీ కి 4.03 శాతం, నోమురా సింగపూర్​, ఏపీఎంఎస్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్ వంటి కంపెనీలకు 1 నుంచి 2 శాతం దాకా వాటాలు ఉన్నాయి. ఈ ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్​లో యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్​ హోల్డింగ్​ కంపెనీ, ఇతర సావరిన్​ వెల్త్​ ఫండ్స్ పెద్ద బయ్యర్లుగా ఉండొచ్చని సమాచారం. 

అప్పులు తగ్గించుకునే వీలు..

అదానీ ఎంటర్​ప్రైజస్​ అప్పులను తగ్గించుకోవడానికి ఫాలో ఆన్​ ఐపీఓ  వీలు కల్పించనుంది. గత కొంత కాలంగా అదానీ గ్రూప్​ వివిధ రంగాలలో భారీ విస్తరణ ప్రాజెక్టులు ప్రకటించింది. కొన్ని పెద్ద కంపెనీలను కొనేయడంతోపాటు, మరికొన్ని కొత్త ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్​ భారీగా అప్పులు తీసుకుంది. గ్రూప్​ అప్పులు రూ. 2. 2 లక్షల కోట్ల దాకా ఉండొచ్చు. దీంతో మార్కెట్లో కొంత మంది ఎనలిస్టులు గ్రూప్​పై సందేహాలు కూడా వ్యక్తం చేశారు. అయితే, ఈ సందేహాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గౌతమ్​ అదానీ తోసిపుచ్చారు. గ్రూప్​ ఆర్థికంగా పటిష్టంగా ఉందని చెబుతూ, అప్పుల పెరుగుదల రేటుతో పోలిస్తే లాభాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫాలో ఆన్​ ఐపీఓ ద్వారా ఫండ్స్​ సేకరించాలనుకునే లిస్టెడ్​ కంపెనీలు కొన్ని సెబీ రూల్స్​ను పాటించడం ద్వారా ప్రాసెస్​ను వేగం చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలు ఒకటి లేదా ఎక్కువ స్టాక్​ ఎక్స్చేంజీలకు తాజా షేర్ల లిస్టింగ్​కు ఇన్​ప్రిన్సిపుల్​ అప్రూవల్​ కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు చూస్తే గతంలో 2011 లో టాటా స్టీల్​ ఇలాగా ఫాలో ఆన్​ ఐపీఓకి వచ్చింది. అప్పట్లో ఇలా ఫాస్ట్​ట్రాక్​ రూట్లో రూ. 3,500 కోట్లను టాటా స్టీల్​ సమకూర్చుకుంది.