న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ దేశవ్యాప్తంగా 60కిపైగా హోటళ్లను నిర్మించాలని భావిస్తోంది. తాము నిర్వహిస్తున్న విమానాశ్రయాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుబంధంగా ఈ హోటళ్లను అభివృద్ధి చేయనుంది. నవీ ముంబైలో నిర్మిస్తున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లోనే సుమారు 15 హోటళ్లను కడతామని గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు.
అదానీ గ్రూప్ అసోం రాజధాని గువాహటి లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన టెర్మినల్‌ను శనివారం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా టెర్మినల్ డిజైన్ గురించి అదానీ గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానీప్రధాని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్చైర్మన్ గౌతమ్ అదానీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
ఈ హోటళ్లను అదానీ గ్రూప్ సొంతంగా నిర్మించినప్పటికీ వాటి నిర్వహణ బాధ్యతలను అంతర్జాతీయ హోటల్ ఆపరేటర్లకు అప్పగించనుంది. ఎయిర్‌పోర్టుల నుంచే కాకుండా రిటైల్, ఆహారం, వినోదం వంటి ఇతర విభాగాల నుంచి వచ్చే రాబడిని పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగానే సహారా స్టార్ వంటి ప్రముఖ హోటళ్లను కొనుగోలు చేయడానికి కూడా అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది.
జేపీ గ్రూప్ కు చెందిన ఐదు హోటళ్లను దక్కించుకోవడానికి కూడా లెండర్ల నుంచి అనుమతి లభించిందని జీత్ అదానీ వెల్లడించారు.
