డిఫెన్స్​, ఏరోస్పేస్​లోకి అదానీ ఎంట్రీ !

డిఫెన్స్​, ఏరోస్పేస్​లోకి అదానీ ఎంట్రీ !

న్యూఢిల్లీ: సోలార్​ ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు వంటి రంగాలలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్​ ఇప్పుడు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాలలో ఎంట్రీ ఇవ్వనుంది. 2030 నాటికి డిఫెన్స్​ మోడర్నైజేషన్​ కోసం  300 బిలియన్​ డాలర్లను ఖర్చు పెట్టాలనేది మన గవర్నమెంట్​ ఆలోచన. ఈ నేపథ్యంలోనే బ్రిటన్​లోని కంపెనీలతో కలిసి ఈ రంగంలో పనిచేయాలనే నిర్ణయానికి వచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ ​ బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో డిస్కషన్స్​ జరిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​జాన్సన్​ అహ్మదాబాద్​లో గౌతమ్​ అదానీని కలిశారు. బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​కు తమ గ్రూప్​ హెడ్​ క్వార్టర్లో  ఆతిధ్యం ఇవ్వడం ఆనందం కలిగిస్తోందని అదానీ చెప్పారు. క్లైమేట్​, సస్టెయినబిలిటీ వంటి అంశాలలో తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ, ప్రత్యేకించి రెన్యువబుల్​ ఎనర్జీ, గ్రీన్​హెచ్​2, న్యూ ఎనర్జీలపై అదానీ గ్రూప్​ దృష్టి పెడుతోందన్నారు. డిఫెన్స్​, ఏరోస్పేస్​ టెక్నాలజీ రంగాలలోనూ యూకే కంపెనీలతో తమ గ్రూప్​ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన జాన్సన్​ మొదటి రోజయిన గురువారం గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చేరారు.  ఇండియా–బ్రిటన్​ దేశాల మధ్య సహకారం మరింత పెంచడంపై జాన్సన్​ ఈ టూర్​లో ఫోకస్​ చేస్తున్నారు. వ్యాపారపరమైన అంశాలకు సంబంధించిన ఫ్రీట్రేడ్​ అగ్రిమెంట్​ సహా,  పలు అగ్రిమెంట్లపై ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎనౌన్స్​మెంట్లు చేస్తారని అంచనా. ఇండియాతో వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలలో భాగస్వామ్యం వంటి వాటిపై ఆయన ఈ పర్యటనలో  దృష్టి పెట్టనున్నారు. ఇండియన్స్​కు మరిన్ని ఎక్కువ వీసాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు జాన్సన్​ వెల్లడించారు. ఐటీ, ప్రోగ్రామింగ్​ సెగ్మెంట్లలో తమ దేశంలో వ్యక్తుల కొరత ఉందని,  టాలెంట్​ ఉన్న వాళ్లను తమ దేశానికి ఆహ్వానించనున్నామని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్​ ప్రాంతంలోని దేశాలతో వాణిజ్యం ఎక్కువగా చేయాలని యూకే ఆశిస్తోంది.