బీజేపీపై కాంగ్రెస్ చార్జ్​షీట్.. ముఖ్యాంశాలివే

బీజేపీపై కాంగ్రెస్ చార్జ్​షీట్.. ముఖ్యాంశాలివే

దేశంలో నరేంద్రమోదీ మళ్లీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని..  బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దును సపోర్టు చేసినట్లవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోక్​సభ ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా.. వద్దా.. అనే రెఫరెండంతోనే జరుగుతున్నాయని తెలిపారు. ‘‘2025 నాటికి రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా. దాన్ని అమలు చేయడమే మోదీ ప్లాన్. బీజేపీకి ఓటు వేసేముందు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఆలోచించాలి” అని ఆయన అన్నారు. 

  • విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా మోదీ సర్కార్ అమలు చేయలేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీకల్చర్ వర్సిటీ వంటి హామీలను అమలు చేయలేదు. 
  • పార్లమెంట్ సాక్షిగా మోదీ తెలంగాణ ఏర్పాటును హేళన చేశారు. 
  • నిధుల విడుదలలో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపారు. తెలంగాణకు రావాల్సిన రూ. 4 వేల కోట్ల జీఎస్టీ పరిహారంతో పాటు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ. 24,205 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు రూ. 1,800 కోట్లను మోదీ సర్కార్ విడుదల చేయలేదు. 
  • రైతులు, పేదలు, యువతకు మోదీ సర్కార్​ దోఖా చేసింది. 
  •  కృష్ణా జలాల్లో వాటాను తెలంగాణకు దక్కనీయలేదు. రైతులను ముంచారు. 
  • 2022 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పి.. తెలంగాణలో ఇండ్లే కట్టకుండా పేదలను మోదీ సర్కార్​ మోసం చేసింది. 
  • పాలమూరు – రంగారెడ్డి సహా తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. 
  • గతంలో కాంగ్రెస్ హయాంలో సింగరేణికి కేటాయించిన గనులను బీజేపీ ప్రైవేటీకరిస్తున్నది. 
  • రాష్ట్రంలోని పలు రైల్వే లైన్ల నిర్మాణంలో కూడా మోదీ సర్కార్ విఫలమైంది. 
  • తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటులో మోసం చేశారు. ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలను మోదీ సర్కార్ ఇవ్వలేదు. 2014 నుంచి సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటులో తెలంగాణపై వివక్ష చూపారు. 
  • మోదీ సర్కార్​ కేవలం పబ్లిసిటీ కోసమే రూ. 10 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసింది. దాదాపుగా అన్ని ప్రింట్ అండ్ టీవీ మీడియా సంస్థలను కొనుగోలు చేసింది. 
  •  మోదీ సర్కార్​ రైతు రుణ మాఫీ చేయలేదు కాని, కార్పొరేట్లకు మాత్రం రూ. 25 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. 
  • బీజేపీ నిరంకుశ పాలనతో ఏడు రాష్ట్రాల్లోని ప్రజా ప్రభుత్వాలను కూల్చింది. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధించింది. 
  • దేశ సార్వభౌమత్వానికి మోదీ భంగం కలిగించారు. 2 వేల చదరపు కిలో మీటర్లకు పైగా భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది.