గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా: బండి సంజయ్​

గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా: బండి సంజయ్​

    దేశాన్ని నంబర్ వన్​గా తీర్చిదిద్దుతున్న మోదీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి

    కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సంజయ్ నామినేషన్  
    హాజరైన కిషన్​రెడ్డి, గుజరాత్ సీఎం భూపేంద్ర 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వందల కోట్ల ఆస్తులు ఉన్నోళ్లని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తనకు వాళ్లలాగా కోట్ల ఆస్తుల్లేవని.. ప్రజల కోసం కొట్లాడినందుకు వందల కేసులు మాత్రం ఉన్నాయని పేర్కొన్నారు. గడీల వారసులు కావాలో.. గరీబోళ్ల బిడ్డ సంజయ్ కావాలో తేల్చుకొని ఓటేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గురువారం ఉదయం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ రజనీకాంత్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సంజయ్​మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ కేసీఆర్ అనే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని, వారిని గెలిపిస్తే.. వందల కోట్ల నుంచి వేల కోట్లు సంపాదించుకుంటారని ఆరోపించారు. తనను గెలిపిస్తే మోదీకి ఓటేస్తానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి ఓటేస్తారని చెప్పారు. దేశాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మోదీకి మద్దతివ్వాలని ఆయన కోరారు.  'నేను మీ బిడ్డను. పక్కా లోకల్. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ నాన్ లోకల్. కాంగ్రెస్ అభ్యర్థి లోకలా? నాన్ లోకలా? ఆ పార్టీ కార్యకర్తలకే తెల్వదు. నేను మీ కోసం నిరంతరం కొట్లాడినా.. ఇంకా కొట్లాడుతా. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఓటేయండి”అని సంజయ్​ కోరారు. ఇక్కడి మంత్రి మాట్లాడితే తన్నుడు, గుద్దుడు, వెదవ అంటూ తిట్టడం తప్పా సాధించేదేమీ లేదని ఆయన విమర్శించారు. 

17 సీట్లు గెలుస్తం: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్​లో  కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను చూసిన తర్వాత సంజయ్ ఇక ప్రచారం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.  సంజయ్ కరీంనగర్​ను వదిలి రాష్ట్రమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని విమర్శించారు. సంజయ్ ప్రజల కోసం జైలుకు వెళ్లిన నాయకుడని అన్నారు.

మూడోసారీ మోదీనే పీఎం: గుజరాత్​ సీఎం 

మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో ఇప్పటికే తమ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుందని, ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం బండి సంజయ్​తో పాటు నాగర్ కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ నామినేషన్ల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీని ఆశీర్వదిస్తే తెలంగాణ సంక్షేమాన్ని ఆయనే చూసుకుంటారని వెల్లడించారు. దేశంలో ఏ ఆధారం లేని వారికి మోదీనే గ్యారంటీ అన్నారు.