ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు..స్పీకర్​కు చేరేలా చూడండి

ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు..స్పీకర్​కు చేరేలా చూడండి
  •  ప్రభుత్వ లాయర్​కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి గెలిచి.. కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల ఫిర్యాదును స్పీకర్‌‌‌‌ ఆఫీసుకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అడ్వొకేట్​ను హైకోర్టు ఆదేశించింది. ఖైరతాబాద్, స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌‌‌‌రావు కొద్ది రోజులకే కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

అయితే, వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్​కు ఫిర్యాదు చేసేందుకు వెళితే అనుమతించడం లేదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వెంకట్​రావు, కడియం శ్రీహరిపై వివేకానంద పిటిషన్‌‌‌‌ దాఖలు చేయగా.. దానంపై కౌశిక్‌‌‌‌రెడ్డి పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. వారిపై వేటు వేయాలంటూ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళితే.. ఆఫీసు లోపలికి రానీయలేదని వారు తెలిపారు. ఈ నెల 10న రిజిస్టర్ పోస్టులో పంపినా రిటన్ ​వచ్చేసిందన్నారు. 

ఈ -మెయిల్‌‌‌‌  ద్వారా పంపినా స్పందించలేదని తెలిపారు. దీంతో తమ ఫిర్యాదులు ప్రభుత్వ లాయర్​ ద్వారా స్పీకర్‌‌‌‌ ఆఫీసుకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఆ పిటిషన్లపై గురువారం జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ల ఫిర్యాదులు స్పీకర్‌‌‌‌ ఆఫీసుకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అడ్వొకేట్ ను ఆదేశించారు. అలాగే, స్పీకర్‌‌‌‌ ఆఫీసుకు ఫిర్యాదులు అందినట్లుగా ధ్రువీకరించాలని సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. కాగా, అఫిడవిట్లు స్పీకర్‌‌‌‌ ఆఫీసుకు చేరేలా చూస్తామని ఏజీ సుదర్శన్‌‌‌‌రెడ్డి కోర్టుకు చెప్పారు.