- రూ. 56 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో కొనుగోలు
న్యూఢిల్లీ: అదానీ విల్మార్ లిమిటెడ్, ఓంకార్ కెమికల్స్ ఇండస్ట్రీస్‌లో 67 శాతం వాటాను రూ.56 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో కొనుగోలు చేయనుంది. అదానీ విల్మార్, అదానీ గ్రూప్ సింగపూర్ విల్మార్ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్. మనదేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఇదీ ఒకటి. ఇది నూనె, గోధుమ పిండి, బియ్యం, పప్పులు, శనగ పిండి, చక్కెర అమ్ముతుంది.
స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అయిన ఓంకార్ కెమికల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 67 శాతం మెజారిటీ వాటాను తీసుకునేందుకు షేర్ సబ్‌స్క్రిప్షన్, షేర్ పర్చేజ్ ఒప్పందంపై సంతకం చేసినట్లు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదానీ విల్మార్ తెలిపింది. దాదాపు 3–-4 నెలల్లో కొనుగోలు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఓంకార్ కెమికల్స్ గుజరాత్‌లోని పనోలిలో సుమారు 20 వేల టన్నుల సర్ఫ్యాక్టెంట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటును నడుపుతోంది.