పరకాల, వెలుగు: పరకాల ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ల తీరుపై అడిషనల్ కలెక్టర్ బి.సంధ్యారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంధ్యారాణి.. ఆసుపత్రి నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో డ్యూటీ టైం గురించి డాక్టర్లను అడగగా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఆన్ కాల్ డ్యూటీ చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా డ్యూటీ చేయడం ఏంటని సూపరింటెండెంట్ సంజీవయ్యను నిలదీశారు. ఈ నెలలో 40 డెలివరీలు కాగా, అందులో 6 మాత్రమే నార్మల్ డెలివరీలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
‘డాక్టర్లు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు’
అడిషనల్ కలెక్టర్ వచ్చిన సమయంలో డాక్టర్లు పచ్చి అబద్దాలు చెప్పారని పేషెంట్లు ఆరోపించారు. మధ్నాహం 12దాటితే ఒక్క డాక్టర్ కూడా ఉండడం లేదని అంతా ప్రైవేట్ క్లినిక్‌లలో పనిచేస్తున్నారని చెప్పారు. రాత్రి సమయంలో ఫోన్ చేసినా రావడం లేదని, పాయిజన్ తాగితే తప్ప స్పందించడం లేదన్నారు.
కమలాపూర్, వెలుగు: కమలాపూర్ సీహెచ్ సీని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. వారం రోజుల కిందే నలుగురు డాక్టర్లను డిప్యూటేషన్‌పై ఇక్కడికి బదిలీ చేశామన్నారు. డాక్టర్లు మెరుగైన సేవలను అందించాలన్నారు.
టైంకు డ్యూటీకి రావాలి
వర్ధన్నపేట, వెలుగు: డాక్టర్లు టైంకు వచ్చి మెరుగైన సేవలు అందించాలని వరంగల్ జేసీ శ్రీవాత్సవ సూచించారు. బుధవారం ఆయన వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. ఓపీ, గైనకాలజీ విభాగాల్లో రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అదనపు గదుల నిర్మాణ పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో పర్యటించారు. ‘మన ఊరు-మన బడి’ కింద రూ.8లక్షలు మాత్రమే మంజూరు అయ్యాయని, మరిన్ని నిధులు ఇవ్వాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ ఏలేందర్రెడ్డి, కమిషనర్ రవీందర్ జేసీ దృష్టికి తీసుకెళ్లారు.
డీఎంహెచ్ వో దవాఖాన నిద్ర
ధర్మసాగర్, వెలుగు: హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ఆదేశాల మేరకు హనుమకొండ డీఎంహెచ్‌వో సాంబశివరావు ధర్మసాగర్ పీహెచ్సీలో బుధవారం రాత్రి ‘దవాఖాన నిద్ర’ చేశారు. ఉదయం వరకు ఆసుపత్రిలోనే బస చేశారు. అంతకుముందు పీహెచ్ సీ సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. 24గంటల పాటు రోగులకు సేవలు అందించాలని, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని కోరారు. బీపీ, షుగర్ పేషెంట్లకు మెడిసిన్ కిట్లు అందజేయాలన్నారు.
