వనపర్తి జిల్లాలో అక్రమ మైనింగ్ను అరికట్టాలి : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్

 వనపర్తి జిల్లాలో అక్రమ మైనింగ్ను అరికట్టాలి : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్

వనపర్తి, వెలుగు : జిల్లాలో అక్రమ మైనింగ్ ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో అక్రమ మైనింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మైనింగ్ ను సీసీ కెమెరాల ద్వారా అరికట్టేందుకు కీలకమైన మార్గాలను గుర్తించాలని పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖ అధికారులకు సూచించారు. 

సంబంధిత కీలకమైన పాయింట్లను ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ పై పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు.  సీసీ కెమెరాలను అమర్చేందుకు కీలకమైన ప్రాంతాలను గుర్తించి మైనింగ్ శాఖకు నివేదించాలని తెలిపారు. సమావేశంలో మైనింగ్ శాఖ ఏడీ గోవిందరాజులు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సీఐ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

భూ కొలతలపై శిక్షణ పొందాలి..

భూ కొలతలు కచ్చితత్వంతో కొలిచే రోవర్స్ పరికరం పనితీరుపై అధికారులు శిక్షణ పొందాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు. భూభారతి చట్టం ప్రకారం భుధార్ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లోని 70 గ్రామాల్లో ఎంజాయ్​మెంట్ సర్వే నిర్వహించేందుకు రోవర్స్ యంత్రాలను పంపారు. శుక్రవారం పోలీస్ పరేడ్ మైదానం లో ట్రైనర్ చంద్రకాంత్ ఆధ్వర్యంలో  జిల్లాలోని 10 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.