హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీ ఎన్.సంజయ్ చెప్పారు. నేరం జరుగుతున్నదని గుర్తించి కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏపీలోని మంగళగిరితో పాటు మరో ఆరు ప్రాంతాల్లో మొత్తం 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. రామోజీరావును ఒకసారి, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్‌ను రెండుసార్లు ప్రశ్నించినట్టు తెలిపారు. చిట్ ఫండ్యాక్ట్ 1982 నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి గ్రూప్ చిట్ ఫండ్స్ నిర్వహిస్తున్నదని అన్నారు. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం కాకుండా కంపెనీల యాక్ట్స్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేస్తున్నారని తెలిపారు.
ఏపీలో 37 బ్రాంచ్‌లు.. 1.04 లక్షల సబ్‌స్ర్కైబర్స్
సబ్‌స్ర్కైబర్స్ నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకున్నా వారి భద్రత కోసం ముందు జాగ్రత్తలో భాగంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీ ఎన్.సంజయ్ చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 108 బ్రాంచ్‌ల్లో 2,351 చిట్ గ్రూపులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఏపీలోని 37 బ్రాంచెస్‌లో1.04 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారని తెలిపారు. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 9,677 కోట్ల టర్నోవర్ జరిగినట్లు వివరించారు. చిట్‌ఫండ్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటిలో ఈ రెండు నెలల వ్యవధిలో రూ.1035.53 కోట్లు అటాచ్ చేశామని చెప్పారు. 9 బ్రాంచ్‌ల్లోని 23 గ్రూపులకు సంబంధించిన రూ.604 కోట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వైండప్ చేయనున్నట్లు తెలిపారు.
