కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సవాల్ విసిరారు. సింగరేణి కార్మికులపై కేంద్రానికి నిజంగానే ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే... రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను తక్షణమే పెంచి చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో మోసి... ఉద్యమాన్ని ముందుకు నడిపిన వీరులు సింగరేణి కార్మికులని ఆయన కొనియాడారు.
మంచిర్యాల వేదికగాశ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో... ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సింగరేణి కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులకు... ఈసందర్భంగా ఎంపీ వంశీకృష్ణ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సింగరేణి కార్మికుల హక్కుల కోసం... రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపు కోసం... పార్లమెంట్‌లో గళం విప్పాను, ఇకముందూ గళం విప్పుతూనే ఉంటా అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.150 కోట్ల భారీ వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సింగరేణి కార్మికులు అనగానే... అందరికీ గుర్తొచ్చేది కాకా వెంకటస్వామి అని... నాడు నష్టాల్లో, అప్పుల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడిన మహోన్నత వ్యక్తి కాకా అని ఆయన గుర్తుచేశారు.
►ALSO READ | బీజేపీ ఓటు చోరీ మాత్రమే కాదు.. సీటు చోరీ కూడా చేస్తోంది: మంత్రి కోమటిరెడ్డి
సింగరేణి ఉద్యోగులకు ఐటీ పర్క్స్ (IT Perks) నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే సింగరేణిలో మారుపేరు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు సుఖంగా ఉంటేనే సంస్థ బాగుంటుందని... కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ వేదికగా అలుపెరగని పోరాటం చేస్తానని ఎంపీ వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
