నల్లగొండ: బీజేపీ ఓటు చోరీ మాత్రమే కాదు.. సీటు చోరీ కూడా చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బలం లేని చోట మూడో అభ్యర్థిని నిలబెట్టడం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
శనివారం (జూన్ 13) నల్లగొండ ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ బీఎల్ఏల కోసం ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తోందని అన్నారు.
►ALSO READ | జగిత్యాలలో చెత్త ఆటోల్లో ఇందిరమ్మ చీరలు.. మహిళలు తీవ్ర ఆగ్రహం
రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతోందని తెలిపారు. బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొనాలన్నారు. ఓటర్ల జాబితాలో లోపాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు.
