వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నాం.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విన్నాం.. కానీ వర్క్ ఫ్రమ్ బైక్ అంటా.. అవును హైదరాబాద్ లో ఒక యువకుడు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. నడుస్తున్న బైక్‌పై వెనుక కూర్చొని, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మరీ ఆఫీస్ వర్క్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ బాధ్యతారాహిత్యమైన వీడియోపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా రోడ్డుపై సర్కస్ చేయడం చూస్తుంటే... "ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే సామెత అక్షరాలా నిజమనిపిస్తోందని ఆయన మండిపడ్డారు.
►ALSO READ | రాజేంద్రనగర్ లో దంచి కొట్టిన వాన..అరాంఘర్, శంషాబాద్ ORR లో భారీ ట్రాఫిక్ జామ్!
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా... అది మీ ప్రాణానికే కాదు, మీ పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది. కడుపు నింపుకోవడానికి చేసే పని... ప్రాణాలను కడతేర్చేలా ఉండకూడదు అంటూ సజ్జనార్ హితవు పలికారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా, మరే ఉద్యోగమైనా ప్రాణం కంటే ముఖ్యం కాదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ ట్వీట్ చేశారు
