రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. శంషాబాద్, ఆరాంఘర్ పరిసర ప్రాంతాలలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
శంషాబాద్‌లోని నేషనల్ హైవేపై మోకాళ్లకు పైగా నీరు చేరడంతో జాతీయ రహదారి కాస్తా చెరువును తలపిస్తోంది. ఊహించని ఈ జలదిగ్బంధాన్ని చూసి వాహనదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ఇటు రోడ్డు పక్కన ఉన్న షాపుల యజమానుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. వరద నీరంతా దుకాణాల్లోకి పోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపుల్లో చేరిన నీటిని బయటకు పంపడానికి మోటార్ల సహాయంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
►ALSO READ | వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే..
ఇక శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిర్‌పోర్ట్ రహదారిపై కూడా భారీ వర్షం పడటంతో అటు వైపు వెళ్లే దారులన్నీ జలమయమయ్యాయి. అటు శంషాబాద్‌తో పాటు ఆరాంఘర్ ఓఆర్ఆర్ (ORR) రింగ్ రోడ్‌పై కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
