ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు .కొనిజర్ల పోలీసుల పక్కా సహకారంతో... రహదారిపై వ్యూహాత్మకంగా వాహనాలను అడ్డగించిన ఈగల్ ఫోర్స్, స్మగ్లర్ల ఆట కట్టించింది. ఈ మెరుపు దాడిలో దాదాపు కోటి రూపాయల విలువైన... 200 కిలోల డ్రై గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
పోలీసుల కళ్ళు గప్పి కారు, బొలెరో వాహనాల్లో అత్యంత చాకచక్యంగా తరలిస్తున్న 104 గంజాయి ప్యాకెట్లను, వాటితో పాటు 7 మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ముఠా నెట్‌వర్క్ చూస్తే పోలీసులు సైతం విస్తుపోతున్నారు. గంజాయి సరఫరా కోసం ముందస్తుగానే ఒక లక్షా 90 వేల రూపాయలను బ్యాంక్ ఖాతాల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ భారీ సరుకు గమ్యస్థానానికి చేరితే... ఇద్దరు ప్రధాన నిందితులకు ఏకంగా 8 లక్షల రూపాయలు ఇచ్చేలా భారీ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.
►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్
ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడానికి ఈగల్ ఫోర్స్ ఏకంగా 18 నెలల పాటు, అంటే ఒకటిన్నర సంవత్సర కాలం నిఘా పెట్టింది.ఈ భారీ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్‌కు వెన్నుముకగా నిలిచిన ప్రధాన ఫైనాన్షియర్ ప్రభు, సప్లయర్ దేవి సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేశారు.
