వానల్లో వేడివేడిగా స్పైసీగా.. క్యాలీఫ్లవర్ గోబీ 65, ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోండి..ఎంజాయ్ చేయండి.. !

వానల్లో వేడివేడిగా స్పైసీగా.. క్యాలీఫ్లవర్ గోబీ 65, ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోండి..ఎంజాయ్ చేయండి.. !

క్యాలీఫ్లవర్ కూర అనగానే చాలామంది ఇష్టపడరు. మొఖం చిట్లిస్తారు. ఇక పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఎంత బలవంతం చేసినా తినరు.. అలాంటివాళ్లందరికీ ఒక్కసారి ఈ యమ్మీ అండ్ హెల్దీ క్యాలీఫ్లవర్ స్పెషల్ రెసిపీలు రుచి  చూపిస్తే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసి, ఇంకా కావాలంటారు.  రుచి ఒక్కటే కాదు.. క్యాలీఫ్లవర్‌లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. బరువు నియంత్రణ నుంచి రోగనిరోధక శక్తి పెంపు వరకు సహాయపడే ఈ సూపర్ వెజిటబుల్‌తో  గోబీ 65, గోబీ ఫ్రైడ్ రైస్ వంటి యమ్మీ వంటకాలతో  తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.. 

క్యాలి ప్లవర్ తో  గోబీ 65.. 

కావాల్సినవి :

క్యాలీఫ్లవర్ తరుగు (ఉడికించి)- ఒక కప్పు 
మైదా- ఒక కప్పు,
కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, 
పెరుగు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
 ఉప్పు, కారం- తగినంత
 పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
కరివేపాకు- రెండు రెమ్మలు, 
ఫుడ్ కలర్- చిటికెడు (ఇష్టముంటే)
కొత్తిమీర - కొద్దిగా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
గరం మసాలా- ఒక టీ స్పూన్

తయారీ :ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఫుడ్ కలర్ వేసి సరిపడా నీళ్లు పోసి జారుగా కలపాలి. అందులో ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు ముంచి కాగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేగించాలి.
మరొక పాన్లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేగించాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. దగ్గరపడ్డాక వేగించిన క్యాలీఫ్లవర్ వేసి మరికాసేపు మగ్గించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి టొమాటో సాస్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది.

క్యాలీ ఫ్లవర్ తో  ఫ్రైడ్ రైస్..

కావాల్సినవి

బియ్యం-ఒక కప్పు, 
క్యాలీఫ్లవర్ తరుగు (ఉడికించి) – ఒక కప్పు 
అల్లం, వెల్లుల్లి తరుగు - ఒక్కోటీ స్పూన్  
ఉల్లికాడల తరుగు-కొద్దిగా
 సోయా, చిల్లీ సాస్- ఒక్కో టేబుల్ స్పూన్ 
టొమాటో సాస్ - ఒక టేబుల్ స్పూన్
 మిరియాల పొడి- ఒక టీ స్పూన్
ఉప్పు- తగినంత 
నూనె- మూడు టేబుల్ స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు

తయారీ

పొడిపొడిగా అన్నం వండాలి. పాన్ లో నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేసి వేగించాలి. అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు, మిరియాల పొడి, సోయా, చిల్లీ, టొమాటో సాస్ వేసి. వేగించాలి. తర్వాత అన్నం వేసి మరికాసేపు ఉడికిస్తే నోరూరించే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ.

క్యాన్సర్ తో పోరాడుతుంది 

క్యాలీఫ్లవర్ లో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని దయాబెటిక్ పేషెంట్స్ కి, బరువు తగ్గాలనుకునే వాళ్లకి, క్యాన్సర్తో బాధపడేవాళ్లకి సూపర్ ఫుడ్ పనిచేస్తుంది. క్యాలీఫ్లవర్లో లోని ఫైబర్ జీర్ణక్రియ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇందులోని ఫోలిన్ అనే పాటన్షియల్ న్యూట్రియెంట్ బ్రెయిన్ని హెల్దీగా ఉంచుతుంది. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి సాయపడుతుంది. 

►ALSO READ | కుంకుమ పువ్వుతో బ్యూటీ సీక్రెట్స్.. మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు కోసం

మూడ్ స్వింగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ న్యూట్రియెంట్, అలాగే క్యాలీఫ్లవర్ లోని  సల్ఫోరఫేస్ క్యాన్సర్ తో పోరాడుతుంది. క్యాన్సర్ బారిన పడకుండా డీఎన్ఏఏ సెల్స్ ని  కాపాడుతుంది. హార్మోన్స్ ని  బ్యాలెన్స్ చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేస్తుంది ఈ వెజిటబుల్. అయితే థైరాయిడ్ ఉన్నవాళ్లు క్యాలీఫ్లవర్ ని తక్కువ తినాలి. కార్డియాక్, రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలున్న వాళ్లు కూడా ఈ వెజిటబుల్ ని తక్కువగా తినడం మంచిదంటున్నారు  హైదరాబాద్ లోని  యశోద హాస్పిటల్స్ లో  చీఫ్ న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్న-డా. సుజాత స్టీఫెన్ .