- అదే రోజున ‘వాహన్’ పోర్టల్ ప్రారంభం
- నేషనల్ డేటాబేస్ లోకి తెలంగాణ వెహికల్స్
- దీని ద్వారా వాహనదారులకు అనేక ప్రయోజనాలు
- ఇప్పటివరకు రెండో వెహికల్ పై అదనంగా 2 శాతం లైఫ్ ట్యాక్స్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇక నుంచి రెండో వెహికల్ కొనేవారిపై అదనపు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ నెల 23 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు వాహనదారు తన పేరు మీద ఒక వెహికల్ కలిగి ఉండి, అదే పేరుపై రెండో వాహనం కొనుగోలు చేస్తే.. 2 శాతం అదనంగా లైఫ్ ట్యాక్స్ ను ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. ఇకపై ఆ అదనపు భారం ఉండదు. ఇది రాష్ట్రంలోని లక్షలాది టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఊరటనిచ్చే విషయం.
ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్త వాహన కొనుగోళ్లను కంట్రోల్చేసేందుకు ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం అడిషనల్ ట్యాక్స్ అమల్లోకి తెచ్చింది. కాగా, ప్రస్తుతం రెండో వాహనంగా జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
కేంద్ర వాహన పోర్టల్‌లోకి..
రాష్ట్రంలో రెండో వెహికల్ కొనేవారిపై అదనపు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేసే సోమవారం నుంచే తెలంగాణ రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘వాహన్’ పోర్టల్ లోకి చేరనుంది. ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నిర్ణయం వల్ల నేషనల్వెహికల్డేటా బేస్ లోకి తెలంగాణ వెహికల్స్ చేరనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ తన సొంత పోర్టల్ ద్వారానే ఆన్ లైన్ సేవలు అందిస్తోంది. దీని ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు.
‘వాహన్’ పోర్టల్‌లో చేరితే కలిగే ప్రయోజనాలివే..
నేషనల్ డేటాబేస్‌తో అనుసంధానం: రాష్ట్రానికి చెందిన వాహనాల వివరాలన్నీ నేషనల్ సర్వర్‌తో అనుసంధానం కావడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వాహన తనిఖీలు జరిగినప్పుడు లేదా వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది.
మోసాలకు అడ్డుకట్ట: సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేవారు ఆ వాహనానికి సంబంధించిన పూర్తి చరిత్ర, పెండింగ్ చలానాలు, యాజమాన్య వివరాలను ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేయవచ్చు. దీని ద్వారా వాహన కొనుగోలులో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడ్తుంది. ముఖ్యంగా దొంగవాహనాల అమ్మకాలు, కొనుగోళ్లకు చెక్‌పడుతుంది.
సేవల్లో వేగం: డిజిటల్ విధానం వల్ల రవాణా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుంది. బ్రోకర్స్ప్రమేయం తగ్గుతుంది. మరింత వేగంగా రవాణా సేవలు అందుతాయి.
ఆన్‌లైన్ సేవలు: ఆర్సీ డూప్లికేట్ కాపీ, పేరు మార్పు, చిరునామా మార్పు, లోన్ తొలగింపు లాంటి సేవలను నేరుగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.
ఎం-పరివాహన్ యాప్: వాహన్ పోర్టల్ ద్వారా వాహనదారులు తమ వాహన వివరాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా తెలుసుకోవచ్చు, డిజిటల్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు.
