ఇట్లయితే బార్లు నడపలేం..ఎక్సైజ్ అధికారులు పీడిస్తున్నరు

ఇట్లయితే బార్లు నడపలేం..ఎక్సైజ్ అధికారులు పీడిస్తున్నరు
  • అదనపు రెన్యూవల్​ ఫీజు విరమించుకోవాలి
  • తెలంగాణ బార్, రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్
     

బషీర్​బాగ్​,వెలుగు: ఎక్సైజ్ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ ఆరోపించారు. నష్టాల్లో నడుస్తున్న బార్ లపై జీవో నంబర్ 145 తీసుకొచ్చి, మరో భారం వేస్తున్నారని వారు వాపోయారు. 

బుధవారం రవీంద్రభారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 30న బార్ల లైసెన్స్ రెన్యూవల్ ఫీజు రూ.40 లక్షలు చెల్లించామని, ఈ నెల 14న తెచ్చిన జీవో ద్వారా అదనంగా రూ.4 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రెన్యూవల్ డేట్ తరువాత విడుదల చేసిన జీవోను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని డిమాండ్​ చేశారు. 

బార్లను మరో  చోటుకు మార్చుకునేందుకు రూ.16 లక్షలు ఉన్న ఫీజును రూ.30 లక్షలకు పెంచారన్నారు. రెంటల్ అగ్రిమెంట్ లో రిజిస్ట్రార్ లీజ్ డీడీ మినహాయించాలన్నారు. వైన్ షాపుల్లో పర్మిట్ రూములను నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి ఎక్సైజ్ డీసీ, శంషాబాద్, శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐలు అవినీతి పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

అనంతరం మంత్రి కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, కోశాధికారి మోహన్ గౌడ్,  ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.