పంచాయతీ సెక్రటరీలకు ఈవో బాధ్యతలు

పంచాయతీ సెక్రటరీలకు ఈవో బాధ్యతలు

హైదరాబాద్ , వెలుగు: జూ. పంచాయతీ సెక్రటరీలకు ఎక్సటెన్షన్ ఆఫీసర్లు (ఈవో, పీఆర్డీ)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎంపీడీవోలు ఉత్తర్వులు జారీ చేయడంపై చర్చ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా లింగాల మండలంలోని ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ఎంపీడీవో ఉత్తర్వులు ఇచ్చారు. నాగర్ కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లోనూ ఇలాంటి ఉత్తర్వులు అందాయి. సాధారణంగా గ్రేడ్ 1 హోదాలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తూ, అనుభవం ఉన్నవారికి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. దీనికి డీపీవో ఉత్తర్వులు ఇవ్వాలి. ఎంపీడీవోలు ఉత్తర్వులివ్వడంపై జూ. పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 4,380 కొత్త పంచాయతీల ఏర్పాటుతో  పంచాయతీల సంఖ్య 12,751కి చేరింది. పంచాయతీ కార్యదర్శుల పోస్టులు చాలా ఖాళీగా ఉండటం, ప్రతి పంచాయతీకి కార్యదర్శి ఉండాలన్న నిర్ణయంతో గతేడాది 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. వివిధ కేసులు, స్టేలు, ఎన్నికల కోడ్ వల్ల  గత మేలో సుమారు 8,500 మందికి పైగా డ్యూటీలో చేరారు.

ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వలేదు

డ్యూటీలో చేరినప్పటి నుంచి తమకు ట్రైనింగ్ ఇవ్వకపోవటంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పడు ఈవోగా అదనపు బాధ్యతలు ఇవ్వటంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ పట్ల సంతృప్తి చెందితేనే మరుసటి ఏడాదికి కొనసాగిస్తామని ప్రభుత్వం ఆఫర్ లెటర్ లో చెప్పడంతో పలు అనుమతులు ఇవ్వటానికి జంకుతున్నారు. ఇక పంచాయతీలో నర్సరీల ద్వారా ఇంటింటికి మొక్కల పంపిణీ, వాటిలో 85శాతం మొక్కలు బతకాలని.. లేకపోతే సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని పలుసార్లు సీఎం వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈవో బాధ్యతలు ఎలా నిర్వర్తించాలని వారంతా భయపడుతున్నారు.

విచారణ జరుపుతాం

నిబంధనల ప్రకారం జూ. పంచాయతీ కార్యదర్శులకు ఈవోలుగా ప్రమోషన్లు ఇవ్వకూడదు. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులేే ఈవో పోస్టులకు అర్హులు. దీనిపై విచారణ జరుపుతాం.

‑ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ చీఫ్​ సెక్రటరీ