చిన్నమ్మే చంపింది.. చీరకు రక్తం అంటిందని పంజాబీ డ్రెస్ మార్చుకుని.. కోరుట్ల చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ

చిన్నమ్మే చంపింది.. చీరకు రక్తం అంటిందని పంజాబీ డ్రెస్ మార్చుకుని.. కోరుట్ల చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి హితీక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడం లేదని ఈ ఘాతుకానికి మమత ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబంలో గౌరవం దక్కడం లేదని మమత పగ పెంచుకుంది. హితీక్ష తల్లిదండ్రులపై కోపంతోనే పాపను పొట్టనపెట్టుకుంది. హితీక్ష దారుణ హత్య తర్వాత అనుమానంతో పాప చిన్నమ్మ మమతను పోలీసులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. హితీక్ష హత్య తర్వాత మమత కట్టుకున్న  చీరను మార్చుకుని పంజాబీ డ్రెస్స్ వేసుకున్నట్లు సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఇంటి నుంచి ఓ కవర్ పట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాలను పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు.

హత్యకు ఉపయోగించిన ఆయుధం(కత్తి), హత్య సమయంలో ధరించిన రక్తం మరకలు అంటిన చీరను పోలీసులు ఇవాళ (సోమవారం) స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసిన నేరాన్ని మమత ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హత్య తర్వాత  ప్యాసింజర్ ఆటోలో సంఘటన స్థలం నుంచి కిలోమీటర్ వరకు వెళ్లి...  జాతీయ రహదారి ఎడమ పక్కన గల జిఎస్ గార్డెన్  సమీపంలోని ఓ వీధిలో హత్యకు ఉపయోగించిన కత్తి, మరో ఆయుధంతో పాటు, మర్డర్ సమయంలో రక్తపు మరకలు అంటిన చీరను పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ALSO READ | మనుషులా.? మృగాళ్లా.? ..ఐదేళ్ల చిన్నారి గొంతు కోసి బాత్రూంలో పడేసి...

ఇవాళ (సోమవారం) నిందితురాలిని  ఆ స్థలానికి తీసుకెళ్లి హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితురాలు మమతకు ఇద్దరు కూతుళ్లు. తల్లి పోలీసు స్టేషన్కు వెళ్లడంతో తాత, పెద్దనాన్న(హితీక్ష తండ్రి), బంధువులు ఆ పిల్లలను చేరదీశారు. భార్య హత్య కేసులో ఉన్నట్లు తెలియడంతో మమత భర్త లక్ష్మణ్ సౌదీలోనే ఉండిపోయాడు. దీంతో.. తండ్రి సౌదీలో, తల్లి పోలీసుల అదుపులో ఉండటంతో.. ఇద్దరు చిన్నారుల పరిస్థితిపై స్థానికుల్లో సానుభూతి వ్యక్తమైంది.