
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తుండగా చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగో తరగతి చదువుతున్న సహస్ర ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఫ్యానుకు టవల్ వేలాడదీసి ఆడుకుంటూ రీల్స్ చేస్తోంది. సరిగ్గా అదే టైంలో పవర్ రావడంతో సహస్ర మెడకు టవల్ బిగుసుకుని అక్కడికక్కడే చనిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. చాలామంది వివిధ రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. యువత రీల్స్ పిచ్చి ఎప్పుడో పరాకాష్టకు చేరింది. కేవలం యువతీ యువకులే కాదు వివాహితులు, చిన్న పిల్లలు కూడా ఈ రీల్స్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు.
రీల్స్‌లో రోడ్లపై, వాహనాలపై చాలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. అయితే అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. చాలా సందర్భాలలో ప్రమాదపు అంచుల్లో యువతీ యువకులు రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ రీల్స్ మోజులో పడి వరంగల్ జిల్లా నర్సంపేటలో అజయ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అందరికన్నా వినూత్నంగా చేయాలని మెడకు ఉరి బిగించుకొని రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తాడు మెడకు బిగుసుకొని మరణించాడు.
మహారాష్ట్రలోని పుణెలో షార్ట్ వీడియో చిత్రీకరణ కోసం ఓ యువతి మరో యువకుడి సాయంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో భవంతిపై నుంచి వేలాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రీల్స్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్య ఇటీవల అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.