
కొమురంభీం జిల్లా: పెంచికల్ పేట్ మండలం లోడ్ పల్లి గ్రామ సమీపంలో అడవిలో విషపు చెట్లు (పంచపూల మొక్కలను) తిని సుమారు తొంభై గొర్రెలు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు చెందిన గొర్రెలు మేత కోసం లోడ్పల్లి అటవీ ప్రాంతంలో వెళ్లాయి. పంచపూల మొక్కలను గొర్రెలు తిని చనిపోవడంతో సదరు గొర్రెల రైతులు బోరున విలపించారు. మరికొన్ని గొర్రెలు అస్వస్థతకు గురి కాగా పశు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వాస్తవానికి.. గొర్రెలు తిన్న ఈ మొక్కలు మనకు తెలియనివి ఏం కాదు. ఊళ్లలో చాలాచోట్ల ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ మొక్కను గ్రామాల్లో పులి కంప అని కూడా పిలుస్తుంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం లాన్తానా కామర (Lantana Camara). అందంగా కనిపిస్తూ.. గుత్తులు గుత్తులు పూలు పూచే ఈ మొక్క ఆకర్షిస్తుంది కానీ అంత మంచిది కాదట.
ఈ మొక్క చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఈ మొక్క జన్మ స్థలం అమెరికా. బ్రిటీషర్లు ఈ మొక్కను ఇండియాకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ మొక్క దేశం మొత్తం పాకింది. వాడుకలో లేని నేలల్లో ఇది ఎక్కువగా విస్తరిస్తుంది. ఈ మొక్కలో ఉండే విషం ప్రభావం వల్ల మేకలు, ఆవులు లివర్ డ్యామేజ్ అయి చనిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మొక్కలకు ఇతర మొక్కలను పెరగకుండా చేసే దుర్గుణం కూడా ఉంది.
దీంతో.. ఈ మొక్క పెరిగే దగ్గర గొర్రెలు, మేకలకు తినడానికి మరో మొక్క దొరకదు. ఆకలికి తట్టుకోలేక మేకలు, గొర్రెలు ఈ మొక్కను తింటే ఇలానే ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ Lantana Camara కేవలం పశువులకే కాదు మనుషులకు ప్రమాదకరమైనదేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మొక్కను పొరపాటున తింటే మనుషుల్లో కూడా కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయి చనిపోయే ప్రమాదం ఉందని తేలింది.