బెల్లంపల్లి లో బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు

బెల్లంపల్లి లో బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు
  •     నలుగురు ఇండిపెండెంట్లు తమతోనే ఉన్నారంటున్న హస్తం నేతలు
  •     ఎక్స్‌అఫీషియోగా నమోదు చేసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్‌

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీటును దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా.. ఇందులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చెరో 14 సీట్లలో గెలిచాయి. మరో ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలువగా.. ఒక స్థానం బీజేపీకి దక్కింది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 18 సీట్లు రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. దీంతో 14 సీట్లలో గెలిచిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

ఈ నేపథ్యంలో 26వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఇప్ప కుమారస్వామి, 34వ వార్డులో బీజేపీ తరఫున గెలిచిన కొక్కుల రామ్మూర్తితో పాటు 30వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన సుఖేసిని భరద్వాజ్‌ తండ్రి, మాజీ కౌన్సిలర్‌ బీజీ.శంకర్‌సింగ్‌ కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఇండిపెండెంట్‌గా గెలిచిన కౌన్సిలర్‌ సుఖేసిని భరద్వాజ్‌ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ క్యాంప్‌లోనే ఉండడంతో ఆ పార్టీ సంఖ్యా బలం 17కు చేరుకొని.. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఒక్క సీటు దూరంలో ఆగిపోయింది. అయితే మరో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సైతం బీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీలో గెలిచిన నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు తమకే ఉందని కాంగ్రెస్‌ లీడర్లు చెబుతున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఎక్స్‌అఫీషియో ఓటుతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్‌ఎస్‌ మరికొందరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. మరో వైపు కాంగ్రెస్‌ నాయకులు సైతం బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను లాక్కునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. చైర్‌పర్సన్‌ సీటుపై ఆశలు పెట్టుకున్న ఓ కాంగ్రెస్‌ నాయకుడు బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు పట్టణంలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు గెలిచిన కౌన్సిలర్లతో ఇప్పటికే క్యాంపులు నిర్వహిస్తున్నాయి.