SA vs ZIM: లారా 400 రికార్డ్ సేఫ్.. జట్టు కోసం 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్

SA vs ZIM: లారా 400 రికార్డ్ సేఫ్.. జట్టు కోసం 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్

క్రికెట్ లో అసాధ్యమైన రికార్డులు అంటూ ఏమీ ఉండవు. టాలెంట్ ఉండాలి గాని సాధ్యం కానీ రికార్డ్ అంటూ ఏదీ ఉండదు. అయితే  కొన్ని రికార్డులు మాత్రం బ్రేక్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. వాటిలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా టెస్టుల్లో నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2004లో ఇంగ్లాండ్ పై లారా టెస్టుల్లో ఏకంగా 400 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్  విస్తుగొలిపేలా చేసాడు. 

ALSO READ | IND VS ENG 2025: బ్రాడ్‌మాన్ అసాధ్యమైన రికార్డ్ గిల్ బ్రేక్ చేస్తే చూడాలని ఉంది: సునీల్ గవాస్కర్

టెస్టు క్రికెట్ లో అప్పటివరకు ట్రిపుల్ సెంచరీలు మాత్రమే చూసినవారు లారా 400 పరుగులు చేయడంతో ఔరా అనుకున్నారు. లారా చేసిన 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ 20 ఏళ్ళు దాటినా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ క్రమంలో ఒక్కరు కూడా లారా రికార్డ్ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. దీంతో లారా రికార్డ్ ఇక బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమని అందరూ భావించారు. ఈ సమయంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ లారా టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను బ్రేక్ చేసినంత పని చేశాడు. 

బులవాయో వేదికగా  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ సమయానికి ముల్డర్ 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. లంచ్ తర్వాత 5-10 ఓవర్లు సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసినా లారా రికార్డ్ ను ముల్డర్ బ్రేక్ చేసేవాడు. అయితే ఈ సమయంలోనే ముల్డర్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. రికార్డ్ గురించి ఆలోచించకుండా జట్టు విజయం కోసం తొలి ప్రాధాన్యమిస్తూ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో లారా రికార్డ్ పదిలంగా మిగిలింది. మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 626 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  ముల్డర్ (367) ట్రిపుల్ సెంచరీతో చెలరేగి ఒంటరి పోరాటం చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.