
టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ తన తొలి సిరీస్ లోనే అత్యుత్తమ ఫామ్ తో చెలరేగుతున్నాడు. తన బ్యాటింగ్ తో గిల్ ప్రపంచ క్రికెట్ లో తన ఉనికిని చాటుతున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి సిరీస్ లోనే వరుస సెంచరీలతో హోరెత్తించాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 147 పరుగులు చేసిన గిల్.. ఆదివారం (జూలై 6) ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
ఓవరాల్ గా తొలి రెండు టెస్టుల్లో గిల్ 585 పరుగులు చేయడం విశేషం. సిరీస్ లో మరో మూడో టెస్టులు మిగిలి ఉన్నాయి. మొత్తం 6 ఇన్నింగ్స్ ల్లో గిల్ మరో 390 పరుగులు చేయగలిగితే ఒక అసాధ్యమైన రికార్డ్ తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్ మాన్ పేరిట ఉంది. 1930 యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై బ్రాడ్ మాన్ 974 పరుగులు చేసి ఒకే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. 95 సంవత్సరాలైనా ఈ రికార్డ్ ఇప్పటివరకు పదిలంగా ఉంది.
ALSO READ : ప్రమాదంలో లారా 400 రికార్డ్: ట్రిపుల్ సెంచరీతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర
బ్రాడ్ మాన్ రికార్డ్ గిల్ బ్రేక్ చేతే చూడాలని టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కోరుకుంటున్నాడు. గవాస్కర్ మాట్లాడుతూ.. "బ్రాడ్ మాన్ 974 పరుగుల రికార్డ్ గిల్ బ్రేక్ చేసి ఒకే సిరీస్ లో 1000 చేస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ రికార్డ్ బ్రేక్ చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. కానీ గిల్ ఈ రికార్డ్ బ్రేక్ చేయగలిగితే చూడాలని ఉంది. లార్డ్స్ లో జరగబోయే మూడో టెస్టుల్లో గిల్ నా 774 పరుగుల రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయం. రికార్డ్స్ బద్దలు కొట్టడానికే ఉన్నాయి". అని గవాస్కర్ అన్నాడు.