‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా’.. దేవుడికి లెటర్ రాసి.. వేములవాడలో ప్రాణం తీసుకున్న యువకుడు

‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా’.. దేవుడికి లెటర్ రాసి.. వేములవాడలో ప్రాణం తీసుకున్న యువకుడు

వేములవాడ, వెలుగు: దేవుడిపై ఒక యువకుడికి కోపం వచ్చింది. ఆ కోపం ఎంతకు దారి తీసిందంటే.. చివరకు ఆ యువకుడు దేవుడికే సూసైడ్ లెటర్ రాసి, ఆ సూసైడ్ లెటర్లో దేవుడిని నిలదీసి ప్రాణాలు తీసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లింది. దేవుడికి లేఖ రాసి ఈ లోకం నుంచి నిష్క్రమించిన ఆ 24 ఏళ్ల యువకుడు తన దేహానికి కాశీ ఘాట్లో దహన సంస్కారాలు చేయాలని చివరి కోరిక కోరాడు. ఈ విషాద ఘటన వేములవాడ పట్టణం మార్కెట్ ఏరియాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణం మార్కెట్ ఏరియాకు చెందిన దివిటి రోహిత్ (24) ఎమ్మెస్సీ చదివాడు. ఖాళీగానే ఉన్న అతను ఏదీ సాధించలేకపోయానని బాధపడేవాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన రోహిత్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకున్నాడు. రోహిత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్ఐ ఎల్లగౌడ్ తెలిపారు.

ఆ సూసైడ్ నోట్లో తాను పడుతున్న మానసిక వేదనకు ఆ యువకుడు అక్షర రూపం ఇచ్చాడు. ‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా.. అదే నీ కొడుకు తలరాత అలా రాయలేదే ! మేము కొడుకులం కాదా ! అని రోహిత్ తన లేఖలో ఆ పరమాత్మను నిలదీశాడు. ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్న రోహిత్ డాక్టర్ అవ్వాలని కలలు కన్నాడని, తాను అనుకున్నది సాధించలేకపోయానని తీవ్ర అసంతృప్తితో కుమిలిపోతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తాను డాక్టర్ కావాలని ఎంతలా ఆకాంక్షించాడో సూసైడె లెటర్ రాశాక Dr.D.R అని తాను రాసిన రాతలు చెప్పకనే చెబుతున్నాయి.