
- కేంద్రమే తెలివిగా తొలగించింది
- ఇది సీరియస్ ఇష్యూ, నేరమని మండిపడుతున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం చాలా తెలివిగా ఆ పదాలను తొలగించిందని మండిపడ్డాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ, పెద్ద నేరమని ఫైర్ అయ్యాయి. కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు అందజేసిన రాజ్యాంగ కాపీల్లోని పీఠికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు లేవని ఆరోపించారు. ‘‘కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో మొదటి రోజు సమావేశాల సందర్భంగా ఎంపీలందరికీ కేంద్రం రాజ్యాంగ కాపీలు అందజేసింది. అయితే వాటిల్లోని పీఠికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు లేవు. కేంద్రం చాలా తెలివిగా ఆ పదాలను తొలగించింది.
Also Read : బీ రెడీ : 25 నుంచి హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ రైలు
ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని మేం పార్లమెంట్ లో లేవనెత్తుతాం” అని తెలిపారు. ‘‘ఈ పదాలను 1976లో చేసిన సవరణల ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎవరికైనా రాజ్యాంగం కాపీ ఇవ్వాలనుకుంటే, ప్రస్తుతమున్న వెర్షన్ కాపీ ఇవ్వాలి కదా! కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తుంటే, వాళ్ల వైఖరి ఏంటో అర్థమవుతోంది” అని అన్నారు. ఇది చాలా సీరియస్ అంశమని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.
బీజేపీ మనస్తత్వానికి నిదర్శనం: ఎన్సీపీ
‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాల తొలగింపు.. బీజేపీ మైండ్ సెట్‌కు నిదర్శనమని ఎన్సీపీ విమర్శించింది. ‘‘ఆ రాజ్యాంగ కాపీల్లోని పీఠిక ఒరిజినల్ వెర్షన్ అని ప్రభుత్వం చెబుతోంది. రాజ్యాంగ సవరణలకు గౌరవం ఇవ్వకూడదని, ఒరిజినల్ వెర్షన్‌నే ఫాలో కావాలని బీజేపీ అనుకుంటే.. పాత పార్లమెంట్ బిల్డింగ్ నుంచి ఎందుకు వచ్చినట్టు? అక్కడే ఎందుకు ఉండలేదు?” అని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ప్రశ్నించారు. ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగించడం నేరమని సీపీఐ నేత బినోయ్ విశ్వం అన్నారు. లేటెస్ట్ వెర్షన్ కాకుండా, ఓల్డ్ వెర్షన్ కాపీలు ఇవ్వడమేంటి, దానిని అందులో ఎందుకు పేర్కొనలేదని టీఎంసీ నేత డోలా సేన్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని పలు ప్రతిపక్ష పార్టీల లీడర్లు చెప్పారు.
అది ఒరిజినల్ వెర్షన్: లా మినిస్టర్
ప్రతిపక్షాల ఆరోపణలపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. ఎంపీలకు అందజేసిన రాజ్యాంగ కాపీల్లోని పీఠిక ఒరిజినల్ వెర్షన్ అని ఆయన స్పష్టం చేశారు. ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను రాజ్యాంగ సవరణల ద్వారా తర్వాతి కాలంలో పీఠికలో పొందుపరిచారని గుర్తు చేశారు. కాగా, ప్రభుత్వం ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగించే ప్రయత్నం చేస్తుందని తాను భావించడం లేదని న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీకుమార్ చెప్పారు. రాజ్యాంగ సవరణ లేకుండా అది సాధ్యం కాదని పేర్కొన్నారు.