
హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చేసిదంతా చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు. ఉపాధి కల్పించామని చెప్తూ.. టెక్స్టైల్ రంగాన్ని రోడ్డున పడేశారని విమర్శించారు. సిరిసిల్లలో కార్మికులు, ఆసాములతో చర్చకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌పై కేటీఆర్ చేసిన విమర్శలకు ఆది శ్రీనివాస్ మంగళవారం ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు.
‘‘వస్త్ర పరిశ్రమలో రూ.247 కోట్ల బకాయిలు పెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో రూ.155 కోట్లు చెల్లించాం. నేతన్నల సమస్యల పరిష్కారానికి, వారికి ఉపాధి కల్పించే అంశంపై రేవంత్ సానుకూలంగా ఉన్నరు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. పనికిమాలిన నిర్ణయాలతో వేలాది మంది కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారు’’అని అన్నారు.