సోయం వర్సెస్ రాథోడ్

సోయం వర్సెస్ రాథోడ్
  •     ఎంపీ కాంగ్రెస్ లోకి వెళ్తారని మాజీ ఎంపీ కామెంట్స్ 
  •     అబద్ధాలు ప్రచారం చేస్తే తానేంటో చూపిస్తానని ఎంపీ హెచ్చరిక
  •     పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో కుమ్ములాట
  •     అయోమయంలో పార్టీ క్యాడర్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ మధ్య డైలాగ్​వార్ నడుస్తోంది. సిట్టింగ్​ఎంపీ స్థానమైన ఆదిలాబాద్​టికెట్ కోసం పార్టీలోని నేతలు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటుండగా..తాజాగా ఎంపీ, మాజీ ఎంపీల మధ్య వివాదం పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ లో చేరుతారంటూ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ మీడియా చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం లేపుతున్నాయి.

 కొన్ని రోజులుగా ఎంపీ టికెట్ విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీకి మధ్య గ్యాప్ పెరిగింది. విజయ్​బాబు, అభినవ్, దశరథ్, రాథోడ్ బాపురావు లాంటి లీడర్లు ఎంపీ టికెట్ ఆశిస్తుండగా, వీరికి ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ఇటీవల ఎంపీ సోయం సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు.  కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టుకుని, దావత్​లు చేస్తే ఎంపీ టికెట్​రాదని, కష్టపడితేనే వస్తుందని కామెంట్స్​చేశారు.  

అబద్దపు ప్రచారం చేస్తే సహించేది లేదు..

తాను పార్టీ మారుతున్నట్లు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్​అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలు సహించేది లేదని ఎంపీ సోయం బాపురావు కౌంటర్ ఇచ్చారు. రాథోడ్ రమేశ్ కు పార్టీలు మారడం అలవాటుగా ఉందన్నారు. స్వార్థం కోసం ఇంకొకరిపై నిందలు వేయడం సరికాదని, తనకు టికెట్టు వచ్చినా, రాకపోయినా చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. మరోసారి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు.