మూడు నెలలు రాకపోకలు బంద్ : వానొస్తే ఊరు దాటలేరు

మూడు నెలలు రాకపోకలు బంద్ : వానొస్తే ఊరు దాటలేరు

ఆదిలాబాద్, వెలుగుఎండాకాలం ముగుస్తుందంటే ఆ గ్రామస్థులకు భయం ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో ఎలా బతకాలనే ఆలోచనలో పడతారు. గ్రామం చుట్టూ నీరు చేరడంతో చుట్టుపక్కల ఊళ్లతో సంబంధాలు తెగిపోతాయి. కనీసం కరెంటు కూడా ఉండదు. రోగాలొస్తే ప్రాణాలు వదులుకోవాల్సిందే. ఆసిఫాబాద్​జిల్లా జైనూర్​మండల కేంద్రానికి 11 కి.మీ. దూరంలో ఉండే డబోలి లొద్దిగూడ గ్రామస్థుల దుస్థితి ఇది. ఈ గ్రామానికి వెళ్లాలంటే జైనూర్​నుంచి బయలుదేరి జాడుగూడ గ్రామం మీదుగా 5 కి.మీ. వెళ్లాలి. అక్కడి నుంచి వాహనాలు వెళ్లడానికి దారి ఉండదు. గుట్ట ప్రాంతం ప్రారంభమవుతుంది. 6 కి.మీ. రెండు గుట్టలు దిగి ఎక్కాలి. తర్వాత గ్రామం వస్తుంది. 19 గడపలు, 114 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ఆసిఫాబాద్​ నియోజకవర్గంలోకి వస్తుంది. గ్రామంలో బడి ఉన్నప్పటికి టీచరు రాడు.

అన్నింటికీ రెడీ..

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గ్రామం చుట్టూ నీరు చేరడంతో బయటకు వెళ్లలేక గ్రామస్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సమస్య గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఉండడంతో తమకు అలవాటయిపోయిందని చెబుతున్నారు. అందుకే ఎండాకాలం ముగుస్తుందంటే చాలు గ్రామస్థులు అప్రమత్తమవుతారు. చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లి మూడు నెలలకు సరిపడా సరుకులు కొనుగోలు చేసుకుంటారు. ప్రస్తుతం గ్రామంలోని అన్ని ఇళ్లలో వర్షాకాలానికి సరిపడా సరుకులు ఉన్నాయి. ప్రతి ఇంట్లో బియ్యం, జొన్నలు, మక్కలు, గోధుమలతోపాటు సహజ సిద్ధంగా లభించే ఇప్పపువ్వు, మర్రి పలుకులు, ఇప్పకాయలను సమకూర్చుకున్నారు. అత్యవసర సమయాల్లో వంట నూనె తయారు చేసుకోడానికి ఇప్పకాయలను ఎండబెట్టి సిద్ధం చేసుకున్నారు. అవసరమైతే వర్షాకాలంలో వ్యవసాయ పరికరాల తయారీ, మరమ్మతులు చేయడానికి గ్రామంలో మాన్కు అనే వ్యక్తి వడ్రంగి పనులు నేర్చుకున్నాడు. అత్యవసర సమయాల్లో వంటనూనె తయారు చేయడానికి లచ్చు అనే వ్యక్తి గానుగ తయారు చేసి దాన్ని నడిపించడం నేర్చుకున్నాడు. వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామస్థులకు తెలియజేయడానికి రాము అనే యువకుడు ఆ కోవకు చెందిన పుస్తకాలు చదువుతున్నాడు.

రోగాలొస్తే కష్టమే..

రోగాలకు కూడా వర్షాకాలమే సీజన్ కావడంతో గ్రామస్థులు అవస్థల పాలవుతున్నారు. గ్రామంలో 50 శాతం పిల్లలకు పౌష్టికాహార లోపం ఉంది. గ్రామానికి అంగన్ వాడీ సరకులు కూడా రావు. ప్రతి వర్షాకాలం పిల్లలకు వ్యాధులు సోకి చనిపోతున్నారు. గత సంవత్సరం మేస్రం మోతీరాం కూతురికి మలేరియా సోకింది. వారంపాటు గ్రామంలోనే చికిత్స చేశారు. కానీ తగ్గలేదు. అటు చూస్తే ఊరు చుట్టూ వాగులు పొంగుతున్నాయి. వాగు దాటేందుకు అష్టకష్టాలు పడ్డప్పటికీ ఫలితం దక్కలేదు. మలేరియా విషమించి చిన్నారి కన్నుమూసింది.