ఎస్టీలకూ దళిత బంధు ఇవ్వాలె

ఎస్టీలకూ దళిత బంధు ఇవ్వాలె

ఉపఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం దళిత బంధు పేరిట కొత్త డ్రామాకు తెరలేపారని బాపూరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించిన వెయ్యి కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. మూడెకరాల భూమి ఇస్తామని దళితులను మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

‘ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 30న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. దళిత బంధులాగే అన్ని వర్గాల ప్రజలకు రూ.10 లక్షలు ఇవ్వాలి. ఏడేళ్లుగా ఓట్ల కోసమే హామీలు ఇస్తూ.. ఎన్నికలు అయ్యాక మర్చిపోతూ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. దళిత బంధును స్వాగతిస్తున్నాం. అయితే ఈ పథకాన్ని హుజూరాబాద్‌‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. అన్ని సామజిక వర్గాల్లో పేదోళ్లు ఉన్నారు. ఈటల రాజీనామా తర్వాతే కాలుకాలిన పిల్లిలా కేసీఆర్ తిరుగుతున్నారు. హుజూరాబాద్ నుంచే పథకాలు ప్రవేశపెట్టడాన్ని బట్టి ఆయనకు ఎంత భయం పట్టుకుందో తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీల అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు’ అని బాపూరావు విమర్శించారు.