- వానొచ్చినప్పుడల్లా ఆదివాసీ గ్రామాల్లో తప్పని తిప్పలు
- మంగపేట మండలంలో మంచంలో రోగి..
మంగపేట/వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు లేకపోవడం, వర్షాలకు తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోవడం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకోవడం కత్తి మీద సాములా మారుతోంది. ఒకచోట తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని మంచంలో మోసుకెళ్లాల్సి రాగా.. మరోచోట ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలింతను ట్రాక్టర్‌పై రెండు వాగులు దాటించి అంబులెన్స్‌కు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాజెక్టు నగర్‌కు చెందిన మడకం శ్రీను వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్‌ను సుమారు కిలోమీటరు దూరంలో నిలిపివేశారు. అనంతరం 108 ఈఎంటీ రాంగాని రాము, పైలెట్ మధుకుమార్ కాలినడకన గ్రామానికి చేరుకుని డాక్టర్ మనీష్ సూచనల మేరకు ప్రాథమిక చికిత్స అందించారు. గ్రామస్తుల సహకారంతో బాధితుడిని మంచంలో మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువచ్చి, అక్కడి నుంచి ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వాగులు దాటించి బాలింతను ఆస్పత్రికి..
వాజేడు మండలం అయ్యవారిపేటకు చెందిన గర్భిణి కావేరి అనూషను ప్రసవం కోసం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా, ప్రసవానంతరం ఆమె తీవ్ర రక్తహీనతతో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇసుకవాగు వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై, గ్రామపంచాయతీ ప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా అనూషను ఆటోలో శ్రీరామ్‌నగర్‌కు తరలించి, అక్కడి నుంచి ట్రాక్టర్‌లో రెండు వాగులు దాటించి కోయ వీరాపురం గ్రామానికి చేర్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌లో ఆమెను ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.
