కరెంట్​కు నోచుకోక ఆదివాసీల తిప్పలు

కరెంట్​కు నోచుకోక ఆదివాసీల తిప్పలు
  • ఏడాదిగా ప్రపోజల్స్​ పెండింగ్    

భద్రాచలం, వెలుగు: అటవీశాఖ అభ్యంతరాలు గిరిజన గ్రామాలకు శాపంగా మారుతున్నాయి. విద్యుత్​ లైన్ల ఏర్పాటుకు అమనుతి ఇవ్వకపోవడంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు గిరిజన గ్రామాలు కరెంట్​కు నోచుకోక అంధకారంలో మగ్గుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో త్రీఫేస్​ కరెంట్​ ఇచ్చేందుకు ఫారెస్ట్​ పర్మిషన్​ రాక పనులు పెండింగ్​లో ఉన్నాయి. కలెక్టర్​ జోక్యం చేసుకొని అనుమతులు వచ్చేలా చూడాలని ఆదివాసీలు కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపేందుకు నిధులు మంజూరు చేస్తున్నా, ఫారెస్ట్​ క్లియరెన్స్​ రాక పనులు ముందుకు పడడం లేదు.

విద్యుత్​ రాక తిప్పలు..

అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి పంచాయతీలోని తిమ్మాపురం, కొత్తగంగారం, చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ బీఎస్ఆర్​ నగర్, గుండాల మండలం మామకన్ను పంచాయతీ బాటన్ననగర్, మణుగూరు మండలం కూనవరం పంచాయతీ వైఎస్ఆర్​ నగర్, అన్నపురెడ్డి మండలం కంపగూడెం  గ్రామాలు రిజర్వ్ ఫారెస్ట్​లో ఉండడంతో కరెంట్​ లైన్  ఏర్పాటుకు అటవీ శాఖ అభ్యంతరం చెప్తోంది. కరెంట్​ పోల్స్​ ఏర్పాటు కోసం ఏడాది కింద ప్రపోజల్స్​ పంపించారు. అయితే ఈ ప్రపోజల్స్ ను​రిజర్వ్​ ఫారెస్ట్​ పేరుతో అటవీ శాఖ పెండింగ్​లో పెట్టింది. త్రీఫేస్​ విద్యుత్​ లైన్ల ఏర్పాటులో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో 1280 గ్రామాలుంటే 1232 గ్రామాలకు మాత్రమే త్రీఫేస్​ సౌకర్యం ఉంది. టేకులపల్లి మండలం సిద్దారం, లక్ష్మీదేవిపల్లిలో తిప్పగుత్త, గండ్రమందం, చింతవర్రి, దమ్మపేట మండలంలోని పూసుకుంట, కటుకూరు,అశ్వారావుపేటలోని మొద్దులమడ, మణుగూరులోని బుగ్గ, ఖమ్మంలోని తోగు, బూర్గంపాడులోని బత్తులనగర్, అశ్వాపురంలోని మనుబోతులగూడెం, మామిళ్లవాయి, గుండాలలోని పెద్దతోగు, ఘనపురం, ఆళ్లపల్లిలోని దొంగతోగు, అడవిరామారం, పెద్ద వెంకటాపురం, సింగవరం,కొత్తసింగవరం తదితర గ్రామాలకు త్రీఫేస్​ లైన్​ ఏర్పాటుకు అటవీశాఖ అనుమతి కోసం ప్రపోజల్స్​ పంపించారు. వీటిలో మణుగూరు మండలం బుగ్గ, ఖమ్మంతోగు గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న లైన్  కండక్టర్​పై కోటింగ్​ లైన్​ వేసేందుకు మాత్రమే అనుమతి వచ్చింది. 

పర్మిషన్​ కోసం చూస్తున్నాం

త్రీఫేస్​ విద్యుత్​ లైన్​ ఏర్పాటుకు అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. చర్ల మండలంలోని కమలాపురం, కొర్కటపాడు, అశ్వాపురం మండలంలోని మామిళ్లవాయి, మనుబోతులగూడెం, బూర్గంపాడు మండలంలోని బత్తులనగర్​లో త్రీఫేస్​ లైన్​ ఏర్పాటు చేయాల్సి ఉంది. మణుగూరు మండలం బుగ్గ, ఖమ్మంతోగు గ్రామాలకు పాత లైన్​ కండక్టర్​ మీద కోటింగ్​ లైన్​ వేసే పనులు చేపడతాం.

- జీవన్​కుమార్, ట్రాన్స్​కో డీఈ, భద్రాచలం

త్రీఫేస్​ లైన్​ ఏర్పాటు చేయాలి

మా గ్రామానికి త్రీఫేస్​ విద్యుత్​ లైన్​ ఏర్పాటు చేయాలి. లో వోల్టేజీ సమస్యతో తిప్పలు పడుతున్నాం. అటవీశాఖ అనుమతుల విషయంలో కలెక్టర్​ చొరవ తీసుకోవాలి. 

- సోంది గోవింద్, ఉప సర్పంచ్, బత్తులనగర్, బూర్గంపాడు