నేరాల కట్టడికి ఆపరేషన్ కవచ్

నేరాల కట్టడికి ఆపరేషన్ కవచ్
  • పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు
  • ఇతర స్టేట్స్, జిల్లాల నుంచి నేరస్థులు రాకుండా ఆపరేషన్ కవచ్ 
  • పాత నేరస్థులపై నిఘా, ఆకస్మిక తనిఖీలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో నేరాల కట్టడికి పోలీసు శాఖ సరికొత్త ఆలోచనతో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇతర స్టేట్స్, జిల్లాల నుంచి నేరస్థులు రాకుండా రాత్రి వేళల్లో ఆపరేషన్ కవచ్ పేరిట తనిఖీలు చేపట్టింది. పాత నేరస్థులు, అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టడంతోపాటు ఇండ్ల వద్దకు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఖాకీ విత్ కిడ్స్ పేరిట రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల ద్వారా వారి తల్లిదండ్రులకు జాగ్రత్తలను తెలియజెప్పేలా చూస్తున్నారు. పార్థిముఠాలు, పేక్ కరెన్సీ ముఠాలు జైలు నుంచి బయటకు రాకుండా  పీడీ యాక్ట్ అమలు చేస్తున్నారు. అపరేషన్​ కవచ్, ఆకస్మిక తనిఖీలతో పలు ముఠా సభ్యులను పట్టుకున్నారు. 

2024 కంటే 2‌‌025లో 83 రోడ్డు ప్రమాద కేసులను తగ్గగా,   మృతుల సంఖ్య  64కి తగ్గింది.  హైవేతోపాటు, ఇతర రోడ్లపై డ్రంక్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. గత ఏడాది 11,412 డ్రంక్ అండ్ డ్రైవ్​ కేసులు నమోదు చేయగా, పట్టుబడినవారికి జైలు, ఫైన్లు విధించారు.  ట్రావెల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్​ డ్రైవ్ టెస్ట్​లు చేస్తున్నారు.  మహారాష్ర్టకు వెళ్తున్న కొన్ని ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు తాగి నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. తరచూగా రోడ్డు ప్రమాదాలు జరిగే 28 బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టారు. మూల మలుపుల వద్ద వెహికల్స్​ స్లోగా వెళ్లేలా కట్టడి చేయటం, హెచ్చరిక బోర్డులు,  రాత్రి వేళ్లలో కనిపించేలా స్టిక్కర్స్ వంటివి అతికించారు.  

పాత నేరస్థుల ఇండ్ల వద్దకు వెళ్లి ఆరా..

పాత నేరస్థులు, అనుమానిత వ్యక్తుల ఇండ్ల వద్దకు వెళ్లి  పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఇటీవల నేరస్థుల ఇండ్ల వద్దకు వెళ్లి ఆరా తీసి నేరస్థుల కుటుంబీకులతో మాట్లాడారు. మళ్లీ నేరాలు చేయకుండా సత్ప్రవర్తనతో ఉండేలా చూడాలని సూచించారు.  

పీడీ యాక్ట్​లు.. 

తరచుగా నేరాలకు పాల్పడే నేరస్థులపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. జిల్లాలో పట్టుబడిన పార్థిదొంగల ముఠా సభ్యులపై, అంతర్రాష్ట ఫేక్ కరెన్సీ నోట్ల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. వారు వెంటనే జైలు నుంచి విడుదల కాకుండా చూస్తున్నారు.   

ఆపరేషన్ కవచ్..​ 

ఆపరేషన్ కవచ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 2025 జూలై నుంచి   అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.   రాత్రి ఇతర స్టేట్స్, జిల్లాల నుంచి వచ్చే నేరస్థులను పట్టుకోగలుతున్నారు. రెండు దొంగల ముఠాలు,   పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను  పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టారు.  6 నెలల్లో 97,822 వెహికల్స్ తనిఖీ చేయగా, 26,363 అనుమానాస్పద వ్యక్తుల గురించి ఆరా తీశారు.  1,041 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.   

ప్రజల భద్రతే ముఖ్యం..

ప్రజల భద్రతే ముఖ్యం. నేరాల కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.  ఆపరేషన్ కవచ్​తో  రాత్రి వేళల్లో తనిఖీలు చేస్తూ, ఇతర స్టేట్స్, జిల్లాల నుంచి నేరస్థులు రాకుండా చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం.  రాజేశ్​చంద్ర, ఎస్పీ- కామారెడ్డి