- బల్దియాల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ
- సంక్రాంతి తర్వాతే నిర్ణయిస్తామని చెబుతున్న నాయకులు
మహబూబ్‌నగర్, వెలుగు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఆయా డివిజన్లు, వార్డుల నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని లీడర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే వారి సంక్రాంతి తరువాత చూద్దామని చెబుతున్నారు.
హైదరాబాద్‌కు ఆశావహులు..
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను స్పీడప్ చేస్తోంది. ఈ నెలాఖరులో లేదంటే ఫిబ్రవరిలో ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీకి దిగాలనుకుంటున్న లీడర్లు హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు.
అక్కడే ఉంటున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. తాము కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకుంటున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా పని చేశామని, అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే లీడర్లు మాత్రం ఎవరికి హామీలు ఇవ్వడం లేదు. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదని, రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాక పేర్లను పరిశీలిస్తామని సమాధానం చెబుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు సంక్రాంతి పండుగ తర్వాత మాట్లాడుకుందామని ఎలాంటి హామీలు ఇవ్వకుండా తిప్పి పంపిస్తున్నారు.
గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన లీడర్లు..
పాలమూరు కార్పొరేషన్లో ఆశావహులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆయా డివిజన్ల నుంచి పోటీ చేయాలనుకుంటున్న కొందరు లీడర్లు తమ డివిజన్ల పరిధిలో పర్యటిస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. ఆ డివిజన్లో దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయనే వివరాలను తెలుసుకుంటున్నారు. తాము కార్పొరేటర్ అయిన వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే ఆ డివిజన్ పరిధిలోని యువతను రహస్యంగా కలుస్తున్నారు.
తాము ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని.. ‘మీ సపోర్ట్ నాకు ఉండాలి’ అంటూ దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్లలో కీలకంగా వ్యవహరించే లీడర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు మద్దతుగా ఉండాలని వేడుకుంటున్నారు. అలాగే ఆయా డివిజన్లలో ఎక్కువగా ఏ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు? తమకు గంప గుత్తగా ఓట్లు వేయాలంటే వాళ్లను ఎలా మచ్చిక చేసుకోవాలి? అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ నెల 10న ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను కూడా పబ్లిష్ చేయనుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. అయితే ఆయా స్థానాల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందరు ఆశావహులు పోటీ చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తుండగా.. వారు కూడా రిజర్వేషన్ ఖరారు అయ్యాకే నిర్ణయం తీసుకుంటామని సమాధానం ఇస్తుండడంతో చాలా మంది డిఫెన్స్‌లో పడ్డారు.
అసలు పోటీ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. తాము పోటీ చేయాలనుకుంటున్న డివిజన్లు, వార్డుల్లో అనుకూలంగా రిజర్వేషన్లు రాకపోతే పరిస్థితి ఏంటి? తమకు అనుకూలంగా వచ్చిన డివిజన్ లేదా వార్డు నుంచి పోటీకి దిగాలా? అక్కడ పోటీకి ఏ లీడర్ సిద్ధం అవుతున్నాడు? వారిని పోటీ నుంచి ఎలా తప్పించాలి? అక్కడ తాము పోటీ చేస్తే గెలుస్తామా? ఓడిపోతామా? ప్రత్యర్థుల బలాబలాలు ఏంటి? అనే విషయాలను కూడా తమకు సన్నిహితంగా ఉన్న లీడర్లతో ఆరా తీయిస్తున్నారు.
