- ఒంటరిగా బరిలోకి దిగనున్న కాంగ్రెస్..
- కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌తో పొత్తులకు పావులు కదుపుతున్న సీపీఐ
- కలిసి వచ్చే వారితో పోటీ చేస్తామంటున్న సీపీఎం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల విషయమై ఆశవాహుల్లో టెన్షన్ నెలకొంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ పోరుపై దృష్టి సారించిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు రిజర్వేషన్లు, పొత్తుల లెక్కల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా కార్పొరేషన్‌గా మారిన కొత్తగూడెం భవిష్యత్ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయో అన్న ఆసక్తి కనిపిస్తోంది.
రిజర్వేషన్ల కలిసొచ్చేనా?
కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలో సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేసి 60 డివిజన్లతో ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనివల్ల గతంలో ఉన్న వార్డుల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని పాల్వంచ ప్రాంతం ఇప్పుడు కార్పొరేషన్‌లో భాగం కావడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
గతంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఉన్న ఎస్టీ అభ్యర్థులు, ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో రిజర్వేషన్లు ఎలా మారతాయోనని ఆందోళన చెందుతున్నారు. మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న నేతలు సైతం రిజర్వేషన్ ఖరారయ్యే వరకు తమ వ్యూహాలను బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్పొరేషన్‌తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో రిజర్వేషన్ల టెన్షన్ నెలకొంది.
అదను కోసం ఎదురుచూస్తున్న బీజేపీ..
జిల్లాలో బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ, ఈ మున్సిపల్ ఎన్నికలను ఒక సువర్ణ అవకాశంగా భావిస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల్లో టికెట్ దక్కని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలతో టచ్‌లోకి వెళ్లిన కమలం పార్టీ నాయకులు చాపకింద నీరులా తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మున్సిపల్ వార్డులు, డివిజన్ల పరిధిలో ప్రజలతో మమేకమవుతూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవాలని పట్టుదలతో ఉన్నారు. కాగా, ఓ వైపు రిజర్వేషన్ల టెన్షన్, మరోవైపు పొత్తుల గందరగోళం మధ్య ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమకు అనుకూలమైన రిజర్వేషన్ రాకపోతే, కనీసం కుటుంబ సభ్యులకైనా అవకాశం వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు.
పొత్తుల సందిగ్ధత..
పొత్తుల విషయంలో ఈసారి జిల్లాలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేయి చేయి కలిపిన కాంగ్రెస్, సీపీఐల మధ్య ఇప్పుడు పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చర్చ జరగుతోంది. సీపీఐ తన ఉనికిని కాపాడుకునేందుకు కొత్త దారులను వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే, మరోవైపు బీఆర్ఎస్ నేతలతో సీపీఐ నేతలు మంతనాలు సాగిస్తున్నారనే వార్తలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఒకవేళ బీఆర్ఎస్‌తో పొత్తు కుదరని పక్షంలో, సీపీఎంతో కలిసి ఉమ్మడి వామపక్ష వేదికగా పోటీ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్న కాంగ్రెస్, -బీఆర్ఎస్ నేతలు, పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.
