నడిరోడ్డు మీద జన్మించిన శిశువు ఎక్కిళ్లు ఆగక మృతి

నడిరోడ్డు మీద జన్మించిన శిశువు ఎక్కిళ్లు  ఆగక మృతి

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం కోయపల్లి కల్వర్టు దగ్గర గురువారం సాయంత్రం జన్మించిన శిశువు శనివారం రాత్రి మృతి చెందాడు. ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన సదుపాయం లేకపోవడం, పుట్టిన బిడ్డను పీహెచ్​సీలో  సిబ్బంది పట్టించుకోకపోవడం, బాలింతను ఆస్పత్రి నుంచి బయటకు పంపడం ఈ ఆదివాసీ అమ్మకు తీరని శోకాన్ని మిగిల్చింది.  నిండు గర్భిణిగా ఆమె  అపసోపాలు పడుతూ ఆస్పత్రికి వెళ్తుంటే.. భారీ వానలకు వాగు దగ్గర రోడ్డు తెగడంతో  అక్కడే బ్రిడ్జి మీద గంటన్నర నరకయాతన  తర్వాత   బాబుకు జన్మనిచ్చింది. కానీ, మూడు రోజుల తర్వాత  ఆ బాబు మరణించడంతో  తల్లి కన్నీరుమున్నీరైంది.  కుమురంభీం ఆసిఫాబాద్‌‌జిల్లా బెజ్జూర్‌‌మండలం నాగేపల్లిలో ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది.

నాగేపల్లి  గ్రామానికి చెందిన కొడప మల్లుబాయిని మూడు రోజుల కిందట ప్రసవం కోసం ఆటో లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..  కోయపల్లి కల్వర్టు  బ్రిడ్జి తెగడంతో.. అక్కడే  ప్రసవించింది.  తర్వాత అంబులెన్స్​లో తల్లీ, బిడ్డను బెజ్జూర్‌‌ పీహెచ్​సీకి తీసుకెళ్లారు. అక్కడ  సిబ్బంది సెలైన్​ పెట్టి,  బాబుకు  టీకా వేయగా..  గంటలో  వెళ్లిపోవాలని చెప్పినట్టు  బాబు తండ్రి శ్రీహరి, అతని అక్క దుర్గక్క ఆవేదన వ్యక్తంచేశారు.  బాబు పాలు తాగుతున్నాడని  చెప్పినా కనికరం లేకుండా‘ జల్దిన సంచులు బయట పెట్టుకోండి, మేం తలుపులు వేసేస్తాం’ అని  దబాయించారని, డబ్బులు అడిగారని తండ్రి ఆవేదన చెందారు.