ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు

ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు

కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలివ్వకపోతే ఆదివాసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఆదివాసీ గిరిజనులను కించపరిచే విధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆర్హులైన ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలిస్తామని సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని ఆదివాసులపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ మరో నిజాం రజాకార్లా వ్యవహరిస్తూ అడవి బిడ్డలైన ఆదివాసులపై విషం గక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్ల కేసీఆర్ కు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు.  5,6 షెడ్యూల్ పై కేసీఆర్ కు అవగాహన లేదని.. 5, 6 షెడ్యూల్ ప్రకారం అడవిపై పూర్తి అధికారాలు ఆదివాసులకే ఉంటాయన్నారు. అదివాసులపై అటవీ, పోలీసు అధికారుల అణచివేతను ఇక సహించబోమని బాపూరావు స్పష్టం చేశారు.