కేంద్ర నిధులను వదలొద్దు..  గ్రామాల అభివృద్ధి ఆగొద్దు : మంత్రి సీతక్క

కేంద్ర నిధులను వదలొద్దు..  గ్రామాల అభివృద్ధి ఆగొద్దు : మంత్రి సీతక్క
  • ఒక్క రూపాయి కూడా లాప్స్ కావొద్దు.. రాష్ట్రానికి రావాల్సిన 
  • హక్కులను సాధించుకోవాలి: మంత్రి సీతక్క
  • జూన్ 2 నాటికి ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు పూర్తి కావాలని ఆదేశం
  • బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు:  ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో రాబట్టాలని, ఒక్క రూపాయి కూడా లాప్స్ కావడానికి వీల్లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కేంద్ర నిధులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, రాష్ట్రం నుంచి వెళ్తున్న భారీ పన్నుల దృష్ట్యా మనకు రావాల్సిన వాటాను పట్టుబట్టి సాధించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, అన్ని విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓడీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రి విస్తృతంగా చర్చించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు మంత్రికి సమర్పించగా.. వాటిలో పలు మార్పులు చేయాలని మంత్రి సూచించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజాప్రతినిధుల పాత్రను మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, వెంటనే 'యుటిలిటీ సర్టిఫికెట్లు' (యూసీఎస్​) సమర్పించి నిధులు విడుదలయ్యేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన 'వీబీ జీ రాం జీ' చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు ఖరారు కాలేదని, గ్రామీణ ఉపాధి కల్పనకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ‘99 డేస్’ ప్రణాళిక అమలులో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

జూన్ 2 నాటికి మహిళా శక్తి భవనాలు పూర్తి కావాలి

రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను  త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి ఈ భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వాటర్ షెడ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉన్నప్పటికీ వేసవిలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.