డెకాయిట్‌‌.. ఓ బ్రోకెన్‌‌ లవ్‌‌ స్టోరీ

డెకాయిట్‌‌.. ఓ బ్రోకెన్‌‌ లవ్‌‌ స్టోరీ

వరుస థ్రిల్లర్స్‌‌తో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న అడివి శేష్.. ఈసారి ఓ యాక్షన్ లవ్‌‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తను హీరోగా షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘డెకాయిట్‌‌’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఏప్రిల్ 10న  సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా అడివి శేష్‌‌ ఇలా ముచ్చటించాడు. 

    ‘ఒక బిజీ రోడ్డుపై  సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే..’ అనే ఒక విజువల్ మెటాఫర్ నుండి ఈ కథ మొదలైంది. ఆ  ఇమాజినేషన్‌‌ నుంచి ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్య మధ్యలో లవ్ స్టోరీని రెడీ చేశాం.  స్టోరీ లైన్‌‌గా చెప్పాలంటే... తుపాన్‌‌ మధ్య చిక్కుకున్న ఓ విఫలమైన ప్రేమకథ ఇది.  ఇందులో ఎమోషన్స్ అన్నీ చాలా ఆర్గానిక్‌‌గా కుదిరాయి.  

    నా గత చిత్రాల్లో ఒక చిన్న భాగంగా ప్రేమకథలు ఉన్నాయి.  కానీ ఇందులో లవ్‌‌ స్టోరీనే మెయిన్ ప్లాట్‌‌. మొత్తం సినిమాకు ప్రేమకథనే కారణం.  లవ్‌‌ స్టోరీ మధ్య యాక్షన్ చూడ్డానికి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ యాక్షన్ సినిమాలో లవ్ చూడటానికి వెళ్తే మాత్రం డిజప్పాయింట్ అవుతారు. 

    ఈ సినిమాకి కర్త కర్మ క్రియ సుప్రియ గారు. ట్రూలీ జమ్ ప్రొడ్యూసర్ ఆమె.  మృణాల్ అద్భుతమైన నటి. సీన్‌‌లో చేయబోయే ఎమోషన్‌‌ను బయట కూడా ఫీల్ అయ్యేది. ఓ సీన్‌‌లో తన పెర్ఫార్మెన్స్‌‌ చూసి సర్‌‌‌‌ప్రైజ్ అయ్యా. నేను కూడా గేమ్ రైజ్‌‌ చేయాలని కాంపిటీషన్ స్పిరిట్‌‌తో వర్క్ చేశా.  నాగచైతన్య శోభితల పెళ్లి వేడుకలో అనురాగ్ కశ్యప్‌‌ గారికి ఈ కథ చెప్పాం.  ఆయన వెంటనే ఓకే చెప్పారు. ఆయన చాలా హానెస్ట్ పర్సన్.  

    ఇందులో హరి క్యారెక్టర్ నుంచి చాలా ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయ్యాను. తను మొహం మీద మాట్లాడే వ్యక్తి.  ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేశా. ఇంట్లో అదే యాస మాట్లాడటం చూసి మా అమ్మ  ‘ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్’ అన్నారు.  ఇక పొడుగ్గా ఉన్నవాళ్లు డ్యాన్స్‌‌ చేస్తే బాగోదని చిన్నప్పుడు నేను డ్యాన్స్‌‌ చేస్తుంటో ఎవరో అన్నారు. దాంతో డ్యాన్స్‌‌లో ఓ లిమిట్‌‌  పెట్టుకున్నా. ఈ సినిమా కోసం దాన్ని దాటేశాను. 

‘మేజర్’ తర్వాత బాలీవుడ్ నుంచి 4 వార్ సినిమాలు, 2 బయోపిక్ ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే నాకు కథలు నచ్చలేదు. స్వతహాగా నాకు బ్రోకెన్ లవ్ స్టోరీస్‌‌ ఇష్టం. ‘దేవదాస్‌‌’ సినిమాను ఎన్నిసార్లు అయినా చూస్తాం.  నా ఫస్ట్ బ్రేకప్‌‌ అప్పుడు నా వయసు 
19 ఏళ్లు. దాన్నుంచి బయటపడటానికి పదేళ్లు పట్టింది. ఆ ఎమోషన్‌‌ను ఇందులోని హరి పాత్ర ద్వారా చూపించడానికి ట్రై చేశా.