శబరిమల ఆలయంలో మరో స్కాం బయటపడింది. ఆలయంలో ద్వారపాలకు విగ్రహాల బంగారం చోరీ ఘటన మరువకముందే ఆలయంలో నైవేద్యం నెయ్యి స్కాం వెలుగులోకి వచ్చింది. నైవేద్యం నెయ్యి విక్రయాల్లో అక్రమాలు బయటపడ్డాయి.నెయ్యాభిషేకం (అదియా శిష్టం నెయ్యి ) అనంతరం నైవేద్యం నుంచి మిగిలిపోయిన దాదాపు 16లక్షల విలువైన నెయ్యి ప్యాకెట్లు విక్రయ కౌంటర్ నుంచి మాయమయ్యాయి. ఈ ఘటనపై దేవస్థానం విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శబరిమల అయ్యప్పకు నెయ్యాభిషేకాని అవకాశం లేని భక్తులు.. దేవస్థానం కౌంటర్లలో ఈ ఆదియా శిష్ట నెయ్యిని కొనుగోలు చేస్తారు. ఈ నెయ్యిని 100మి.లీ ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఒక్క ప్యాకెట్ ధర 100 రూపాయలు. ప్రత్యేక ఆలయ అధికారి ఈ స్టాక్ ను అమ్మకం కౌంటర్లకు అందజేస్తారు. భక్తులు కొనుగోలు చేయగా వచ్చిన మొత్తాన్ని దేవస్థానం ఖాతాలో జమ చేయలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుత మండల సీజన్ లో అమ్మకాల్లో ఈ స్కాం జరిగినట్లు అధికారులు చెప్పారు.
శబరిమల అయ్యప్పకు నెయ్యాభిషేకం తర్వాత మిగిలిన నెయ్యిని ప్యాకెట్లలో నింపడం, పంపిణీకి రికార్డుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుట్టు గా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
అభిషేకం నెయ్యి మాయం విషయంపై శబరి మల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పందించారు. నెయ్యి ప్యాకెట్లు మాయం అయ్యాయని విషయం తెలియగాని విజిలెన్స్ కు అప్పగించారు. దర్యాప్తు లో నిజానిజాలు తెలుస్తాయి. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
