ఆరేండ్లు నిండితేనే ఫస్ట్ క్లాసులో అడ్మిషన్

ఆరేండ్లు నిండితేనే ఫస్ట్ క్లాసులో అడ్మిషన్
  •  రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ ఆదేశాలు 

 హైదరాబాద్, వెలుగు: ఒకటో తరగతిలో అడ్మిషన్లపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆరేండ్లు నిండిన పిల్లలకే ఫస్ట్ క్లాసులో  అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. రానున్న 2024–25 విద్యాసంవత్సరం నుంచి అన్ని రాష్ర్టాలు దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యాహక్కు చట్టం అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అయితే, దీన్ని తెలంగాణలో అమలు చేస్తారా లేదా  అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయమై విద్యాశాఖ అధికారులు సమీక్షించనున్నారు. విద్యాహక్కు చట్టం, నేషనల్‌‌ ఎడ్యుకేషన్‌‌ పాలసీ (ఎన్‌‌ఈపీ–2020) ప్రకారం ఒకటో తరగతిలో జాయిన్ అవ్వాలంటే చిన్నారికి ఆరేండ్లు నిండాలనే నిబంధనలు తీసుకొచ్చారు. 3 నుంచి 8 ఏండ్ల వయస్సులో మూడేండ్ల ప్రీ స్కూల్ ఉండాలని, ఆ తర్వాత ఫస్ట్, సెకండ్ క్లాసులు పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో  ఈ నిబంధన ఉండటంతో దీన్ని అమలు చేసేందుకు బీజేపీయేతర రాష్ర్టాలు ముందుకు రావట్లేదు. 

కేంద్రం ఆధీనంలోని విద్యాసంస్థల్లో, సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న స్కూళ్లలో ఆరేండ్ల తర్వాతే ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇస్తున్నారు. దాదాపు రెండేండ్ల నుంచి ప్రతి రెండు, మూడు నెలలకోసారి కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాలకు లేఖలు రాస్తున్నది. తాజాగా మరోసారి కేంద్రం లేఖ రాసింది. రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ రావడంతో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ల అంశంపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది.