
- రాత్రిపూట జోరుగా దందా
- తండాల్లో గుప్పుమంటున్న గుడుంబా
లాక్ డౌన్‌తో వైన్స్‌లు బంద్ చేయడంతో మందు కల్లు, నాటు సారా దందా జోరందుకున్నది. గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కేవలం రాత్రి పూట మాత్రమే ఈ దందా కొనసాగిస్తున్నారు. గద్వాల మండలం జమ్మి చెడులో బిందెల్లో కల్లును విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి రూ. 250 నుంచి 300 వరకు తీసుకుంటున్నారు.
కల్లు తయారీ కేంద్రంపై దాడి
కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. గద్వాల మండలం ముల్కలపల్లిలో రామన్ గౌడ్ అనే వ్యక్తి కల్లు తయారు చేస్తూ.. గద్వాల పట్టణానికి సరఫరా చేస్తున్నాడు. బుధవారం సమాచారం అందుకున్న ఆఫీసర్లు దాడులు చేయగా100 లీటర్ల కల్లు దొరికింది. దీన్ని అక్కడే పారబోసి కేసు నమోదు చేశారు.
సారా తయారీదారులపై కేసు
అక్రమంగా సారా బట్టీల నిర్వహిస్తున్న వ్యక్తులపై తెల్కపల్లి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు కేసులు పెట్టారు. బుధవారం ఉప్పునుంతల మండలం దేవదారు కుంట తండా, కంసాన్ పల్లి తండాలో దాటు నిర్వహించగా.. 800 లీటర్ల బెల్లం పానకం, 30 లీటర్ల నాటుసారా పట్టుబడింది. స్వాధీనం చేసుకొని 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ పరమేష్ గౌడ్ తెలిపారు.
మందు అమ్ముతున్న 8 మంది అరెస్టు..
ఆమనగల్లు పట్టణంలో మంగళవారం రాత్రి అక్రమంగా మద్యం అమ్ముతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ధర్మేష్ తెలిపారు. ఒక వైన్స్ షాపు పార్ట్‌నర్లు మద్యాన్ని నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నామన్నారు. 40 బాటిళ్లను స్వాధీనం చేసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించామని చెప్పారు.