కొబ్బరి పీచు, బెల్లం నీళ్లకు.. ప్రాణాంతక రసాయనాలు కలిపి కల్తీ టీ పొడి

కొబ్బరి పీచు, బెల్లం నీళ్లకు.. ప్రాణాంతక రసాయనాలు కలిపి కల్తీ టీ పొడి
  • సనత్​నగర్​లో కల్తీ కేంద్రం గుట్టురట్టు
  • ఒకరు అరెస్ట్, 120 కిలోల కల్తీ టీ పొడి స్వాధీనం

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రాణాంతక రసాయనాలతో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్​నగర్ పరిధిలోని ఫతేనగర్​కు చెందిన జగన్నాథ్ బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌(33) తన ఇంట్లో కల్తీ టీ పొడి తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో వెస్ట్​జోన్ టాస్క్ ఫోర్స్, సనత్​నగర్ పోలీసులు కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్​చేసి విచారించగా, షాకింగ్​విషయాలు బయటపడ్డాయి.

నిందితుడు అతితక్కువ ధరకు కొబ్బరి పీచు పొడిని సేకరించి, దాన్ని బెల్లం నీటిలో నానబెట్టి ఎండబెడుతున్నాడు. మూడ్రోజుల తర్వాత ఆ మిశ్రమానికి ‘సన్​సెట్ ఎల్లో’, ‘టార్ట్రాజైన్ ఆరెంజ్’ వంటి హానికరమైన సింథటిక్ రంగులు కలిపి అసలైన టీ పొడిలా మార్చి స్థానిక టీ స్టాళ్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.

ఈ తనిఖీల్లో 120 కిలోల కల్తీ టీ పొడి, 138 కిలోల కొబ్బరి పీచుతోపాటు గ్యాస్ సిలిండర్, బెల్లం బాక్సులు, వెయింగ్ మెషిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సీఐ దేవేందర్ హెచ్చరించారు.