ఊబకాయంతో క్యాన్సర్‌‌‌‌ ముప్పు ! బరువుకు క్యాన్సర్‌‌‌‌తో సంబంధం ఏంటి ?

ఊబకాయంతో క్యాన్సర్‌‌‌‌ ముప్పు ! బరువుకు క్యాన్సర్‌‌‌‌తో సంబంధం ఏంటి ?

ఒకప్పుడు ఊబకాయం అంటే మధ్య వయసులో వచ్చే సమస్యగానే భావించేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు ఇరవై ఏండ్లు నిండకుండానే బరువులో సెంచరీ దాటుతున్నారు. అయితే.. చాలామంది ఇది కేవలం లుక్స్‌‌ లేదా ఫిట్‌‌నెస్‌‌ సమస్య మాత్రమే అనుకుంటారు. కానీ.. యుక్త వయసులో పెరిగే అధిక బరువు భవిష్యత్తులో కొన్ని రకాల క్యాన్సర్లకూ కారణమవుతోందని ఈమధ్య వచ్చిన పరిశోధనలు చెప్తున్నాయి. ఇంతకీ బరువుకి, క్యాన్సర్‌‌‌‌కి సంబంధం ఏంటంటే..

టెక్నాలజీ పెరిగిన తర్వాత లైఫ్ స్టైల్‌‌లో చాలా మార్పులు వచ్చాయి. వాటి వల్ల యుక్త వయసులోనే ఊబకాయం పెరుగుతోంది. ఉదయం లేవగానే మొబైల్‌‌, రోజంతా కంప్యూటర్‌‌ ముందు పని, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, ఫాస్ట్‌‌ఫుడ్‌‌ తినడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం... ఇవన్నీ కలిసి బరువుని వేగంగా పెంచేస్తున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ మధ్య వచ్చిన పరిశోధనలు మాత్రం ఊబకాయం ఉన్నవాళ్లకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయి. యుక్త వయసులో విపరీతంగా బరువు పెరగడం కేవలం షుగర్‌‌, బీపీ, హార్ట్‌‌ సమస్యలనే కాదు.. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని సైంటిస్ట్‌‌లు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం ఐదింతల వరకు పెరిగినట్టు అధ్యయనాల్లో తేలింది.

ఏం చెప్తున్నాయి ?
స్వీడన్‌‌లోని మాల్మోలో ఉన్న లుండ్​ యూనివర్సిటీ సైంటిస్ట్‌‌లు చేసిన ఈ పరిశోధనా ఫలితాలను  టర్కీలోని ఇస్తాంబుల్‌‌లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ (ఎకో–2026)లో విడుదల చేశారు. ఈ పరిశోధనలో 17 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల సుమారు 6,30,000 మంది (2.51 లక్షల మంది మగవాళ్లు, 3.79 లక్షల మంది స్త్రీలు) డేటాను విశ్లేషించారు. ప్రతి వ్యక్తి బరువును సగటున నాలుగు సార్లు కొలిచి, 2023 వరకు క్యాన్సర్ నిర్ధారణలను ట్రాక్ చేశారు. బరువు ఎక్కువగా పెరిగిన వాళ్లతో తక్కువగా పెరిగిన వాళ్లను పోల్చి చూశారు. అప్పుడు ఏం తేలిందంటే..

పురుషుల్లో: 30 ఏళ్లలోపు ఊబకాయం బారిన పడిన పురుషులకు సాధారణ బరువు ఉన్నవారితో పోలిస్తే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరిగింది. అలాగే ప్యాంక్రియాటిక్, కిడ్నీ క్యాన్సర్ల ముప్పు రెట్టింపు అయ్యింది. పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 58శాతం పెరిగింది.

మహిళల్లో: 30 ఏళ్ల లోపు అధిక బరువు పెరిగిన మహిళలకు గర్భాశయ(ఎండోమెట్రియల్) క్యాన్సర్ వచ్చే ముప్పు 4.5 రెట్లు పెరిగింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు 67 శాతం పెరిగింది. మూత్రపిండ కణ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం రెండింతలు, మెనింజియోమా వచ్చే ప్రమాదం 76 శాతం పెరిగింది.

బరువు పెరిగితే వచ్చే క్యాన్సర్లు ఇవే.. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌‌‌‌సీ) ప్రకారం అధిక బరువు దాదాపు 13 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. వాటిలో ముఖ్యమైనవి.. పెద్దపేగు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కిడ్నీ, థైరాయిడ్ క్యాన్సర్, పిత్తాశయ,  ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.

బరువుకు క్యాన్సర్‌‌‌‌తో సంబంధం ఏంటి ?

* బరువు అధికంగా పెరిగిన వాళ్ల శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోతుంది. అది అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. ఎక్కువైన కొవ్వు కణాలు నిరంతరం ఒక రకమైన వాపు (ఇన్‌‌ఫ్లమేషన్)కు కారణమవుతాయి. ఆ తర్వాత  కణాల డీఎన్‌‌ఏ దెబ్బతిని క్యాన్సర్ కణాలుగా మారుతాయి.

* అధిక కొవ్వు కణాలు శరీరంలో ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. అవి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లకు ఇంధనంగా పనిచేస్తాయి.

* ఊబకాయం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్‌‌ పెరగడం వల్ల కణాలు అసాధారణంగా విభజన చెంది గడ్డలుగా (ట్యూమర్లు) మారతాయి.

ఎప్పుడు పెరిగిందనేదే ముఖ్యం
ఇప్పటివరకు చాలామంది డాక్టర్లు బీఎంఐ(బాడీ మాస్‌‌ ఇండెక్స్‌‌) ఆధారంగా మాత్రమే ప్రమాదాన్ని అంచనా వేసేవాళ్లు. కానీ, ప్రస్తుతం ఎంత బరువు ఉందన్నది మాత్రమే కాదు.. యుక్తవయసు నుంచి ఎంత వేగంగా బరువు పెరిగారనేదే ముఖ్యమని, దాని ఆధారంగా క్యాన్సర్‌‌‌‌ ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు సైంటిస్ట్‌‌లు. 

►ALSO READ | సమోసా క్యాపిటల్ అని ఏ సిటీని అంటారో తెలుసా! అక్కడ దొరికే వెరైటీలు ఎక్కడా చూసి ఉండరు

ఉదాహరణకు.. 25 ఏళ్ల వయసులోనే ఊబకాయానికి చేరిన వ్యక్తి శరీరం యాభై ఏండ్లు వచ్చేనాటికి పాతికేండ్లపాటు అధిక కొవ్వు వల్ల ఎఫెక్ట్‌‌ అవుతుంది. ఈ లాంగ్‌‌టర్మ్‌‌ ఎక్స్‌‌పోజర్‌‌ వల్ల క్యాన్సర్‌‌ ప్రమాదం మరింత పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

ఏం చేయాలి ?
* యుక్త వయస్సు.. కెరీర్, చదువుల ఒత్తిడి వల్ల లైఫ్‌‌స్టైల్‌‌ పూర్తిగా దెబ్బతినే సమయం. ఈ వయస్సులో బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు అవేంటంటే..

* ఫుడ్‌‌లో మార్పులు: జంక్, ప్రాసెస్డ్‌ ఫుడ్​, మైదా, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, కూల్‌‌డ్రింక్స్‌‌కు దూరంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

* శారీరక శ్రమ: ఐటీ ఉద్యోగాలు లేదా గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి నడవాలి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు బ్రిస్క్‌‌ వాకింగ్‌‌, సైక్లింగ్, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి.

* వెయిట్‌‌ చెక్‌‌: వారానికి లేదా నెలకు ఒకసారి బరువు చెక్‌‌ చేసుకుంటూ, బరువు పెరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.

* నిద్ర, ఒత్తిడి: మనిషికి రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. సరిపడా నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల శరీరంలో కార్టిజాల్ హార్మోన్ పెరిగి బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి సరిపడా నిద్రపోవడం చాలా ముఖ్యం.