ఇంటింటికీ మటన్​, చికెన్​, మందు.. 

ఇంటింటికీ మటన్​, చికెన్​, మందు.. 
  • జనాన్ని తమవైపు తిప్పుకునేందుకు విందు రాజకీయాలు
  • ఎమ్మెల్యేలు, ప్రత్యర్థుల పోటా పోటీ ఏర్పాట్లు
  • లోడ్ల కొద్దీ లిక్కర్​కు, యాటలకు ఆర్డర్లు.. 
  • రేపో మాపో గ్రామాలకు సప్లయ్
  • అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా నేతల ముందస్తు వ్యూహాలు
  • గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకొని దావత్​లకు ప్లాన్లు


ఉత్తర తెలంగాణలోని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఒకరు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఆయన పై కేడర్​లో, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు దసరా పండుగను అవకాశంగా మలుచుకోవాలని ఆయన ప్లాన్​ వేశారు. దసరా దావత్​ల పేరిట జనాన్ని తనవైపు తిప్పుకునేందుకు లారీ లిక్కర్​ లోడ్​ను బుక్ చేయిం చారు. గ్రామాలవారీగా అనుచరులకు డబ్బులు ఇచ్చి యాటలు తెప్పించుకోవాలని చెప్పారు. ఆ ఒక్క సెగ్మెంట్​లోనే ఎమ్మెల్యే పేరుతో వందకు పైగా మేకలు, గొర్రెల కోసం అడ్వాన్సులు చెల్లించారు. ‘‘ఈ దసరాకు మా ఎమ్మెల్యే మాకు మస్తు దావత్ఇ స్తున్నడు’’ అని పార్టీ కేడర్ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ ముచ్చట.. ఇదే సెగ్మెంట్​ నుంచి పోటీ చేయాలను కుంటున్న ప్రత్యర్థి చెవినపడింది. ఆ ప్రత్యర్థి కూడా తానేం తక్కువ కాదంటూ.. ఓటర్లకు దసరా దావత్​ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.


హైదరాబాద్, వెలుగు: ఇంటింటికీ మటన్​, చికెన్​.. తాగినోళ్లకు తాగినంత మందు.. దసరా రోజు జనానికి ఇచ్చేందుకు లీడర్లు చేసుకుంటున్న ఏర్పాట్లు ఇవి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల తరఫున అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న వాళ్లు  తమ కేడర్​ను , ఓటర్లను దసరా దావత్ పేరుతో ఖుషీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లోడ్ల కొద్దీ లిక్కర్​కు, వందల కొద్దీ యాటలకు ఆర్డర్లు ఇస్తున్నారు.

తమ నియోజకవర్గం పరిధిలో ఎన్ని ఊర్లు ఉన్నాయి..? ఏ ఊరిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? అందులో తమకు ఓటు వేసే వాళ్లు ఎంత మంది..? అని లెక్కలు తెప్పించుకొని.. దానికి తగ్గట్టుగా ప్లాన్​ చేసుకుంటున్నారు. ఒక వేళ ముందస్తు ఎన్నికలు రాకపోయినా.. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదే ఉండటంతో ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చుక్క, ముక్కతో దసరా దావత్​కు రెడీ అవుతున్నారు. ఇందు కోసం ఒక్కో నాయకుడు  రూ. 70 లక్షల నుంచి రూ. కోటి దాకా ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. మునుగోడులో త్వరలో ఉప ఎన్నిక జరుగనుండటంతో అక్కడ గత నెల రోజుల నుంచి దావత్​లు నడుస్తున్నాయి. ఇదే తీరుగా ఇప్పుడు దసరా రోజు రాష్ట్రమంతా లీడర్లు దావత్​లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

లెక్కలు తెప్పించుకొని..

ఒక్కో నియోజకవర్గంలో కోటి రూపాయల దాకా దసరా దావత్​కు ఖర్చు పెట్టేందుకు లీడర్లు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో తమ వారు ఎంత మంది? ఏ సామాజికవర్గం వారిలో ఎవరు తమ మనుషులు? ఏ గ్రామంలో ఎంత మందికి దావత్ ఇవ్వాల్సి ఉంటుంది? ఇందులో యూత్, కుల సంఘాలు, పార్టీ కేడర్.. ఎంత మంది ఉంటారు? వీరికి ఎక్కడికక్కడ, ఎవరి ఊరిలో వారికి దావత్ లు ఏర్పాటు చేసేందుకు ఎన్ని మందు బాటిళ్లు, ఏ బ్రాండ్ అవసరం? ఎన్ని యాటలు అవసరం అవుతాయి? అనే వివరాలను ఆయా పార్టీల మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​ల ద్వారా ఎమ్మెల్యేలు, కీలక నేతలు తెప్పించుకొని.. ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ లెక్కల ప్రకారం సరిపోయేంత మందును బుక్​ చేస్తున్నారు. యాటలను తెప్పించేందుకు గ్రామాల వారీగా తమ అనుచరులను పురమాయించారు. 

ఎక్కడి వారు అక్కడే దావత్​ చేసుకునేలా..!

గోదావరి తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే  దసరా దావత్ పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. ఆయన ప్రస్తుతం ఆ జిల్లాలో కీలకమైన స్థానిక సంస్థల అధికార పదవిలో ఉన్నారు.  ప్రతి గ్రామంలో తన అనుచరులకు, పార్టీ కేడర్ కు, తమ అనుకూల ఓటర్లకు దావత్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఎక్కడి వారు అక్కడే పార్టీ చేసుకునేందుకు వీలుగా కావాల్సిన డబ్బును ఇప్పటికే తన నమ్మిన బంట్ల ద్వారా ఆయన చేరవేశారు.

దీంతో ‘‘మా నాయకుడు మాకు దసరా దావత్ చేసుకొమ్మని డబ్బులు పంపించిండు”అంటూ ఆయన అనుచరగణం గ్రామాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రం సాధారణంగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. దీన్ని మరింత ఆసరా చేసుకున్న ఆ మాజీ ఎమ్మెల్యే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వారిని కూడా ఇలా దసరా దావత్ పేరుతో దగ్గర చేసుకునే పనిలో పడ్డారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ దసరా దావత్​లపైనే లీడర్లు ఫోకస్​ పెట్టారు. మూడునాలుగు రోజుల్లో గ్రామాల్లో లిక్కర్​ లోడ్లు దిగనున్నాయి. యాటల కోతలు మొదలు కానున్నాయి.  

పదిరోజుల ముందే ఆర్డర్లు 

దసరా పండుగ పూట మద్యం, మటన్ కు మార్కెట్​లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అసలు సమయానికి కావాల్సినంత మటన్ అంత ఈజీగా దొరకదు. వైన్ షాపుల్లో ఎప్పటికప్పుడు లిక్కర్​ ఖాళీ అవుతుంటుంది. దీంతో ముందుచూపుతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వాళ్లు లోడ్ ల కొద్దీ మద్యాన్ని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పది పదిహేనురోజుల కిందట్నే మద్యం  బుకింగ్స్​ జరిగిపోయాయి. మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు, నాటు కోళ్ల కోసం కూడా ముందస్తుగా డబ్బులు చెల్లించారు. రేపో ఎల్లుండో లిక్కర్​ కార్టన్లు, యాటలు నియోజకవర్గ కేంద్రాల్లో దిగనున్నాయి. ఆ వెంటనే వాటిని గ్రామాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.