భూగర్భంలోఎస్టీపీ.. శబ్దం రాదు.. దుర్వాసన ఉండదు.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో అధునాతన ప్లాంట్

భూగర్భంలోఎస్టీపీ.. శబ్దం రాదు.. దుర్వాసన ఉండదు..  మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో అధునాతన ప్లాంట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్​లో తొలిసారిగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన అండర్ గ్రౌండ్ మురుగునీటి శుద్ధి కేంద్రం (యూజీ – ఎస్టీసీ) అందుబాటులోకి రానుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం నిధులతో నిర్మించనున్న 39 ఎస్టీపీలలో ఒకదానిని హైదర్శకోట్ వద్ద భూమి అడుగున ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ ఎస్టీపీని సీక్వెన్స్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్​బీఆర్) టెక్నాలజీతో పాటు మూవింగ్ బెడ్ బయో ఫిల్మ్ రియాక్టర్ (ఎంబీబీఆర్) లేదా మెంబ్రెన్ బయో ఫిల్మ్ రియాక్టర్ (ఎంబీఆర్) టెక్నాలజీలతో నిర్మించనున్నారు. భూమి కింద ప్లాంట్​ను ఏర్పాటు చేసి, పైన ఉన్న ఖాళీ స్థలాన్ని ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ వంటి ఇతర అవసరాలకు వినియోగించుకునేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

  • వంద శాతం శుద్ధే లక్ష్యం..

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటి వల్ల మూసీ నది తన ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో నదిని రక్షించి సుందరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నగరంలో రోజుకు 2,000 ఎంఎల్‌‌‌‌డీల మురుగునీరు చేరుతుండగా, కేవలం 772 ఎంఎల్‌‌‌‌డీలు మాత్రమే శుద్ధి అవుతోంది. ఈ సవాల్​ను అధిగమించేందుకు మూసీ పొడవునా మెట్రో వాటర్ బోర్డు ఇప్పటికే 1,106 ఎంఎల్‌‌‌‌డీల సామర్థ్యంతో 27 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపట్టింది. 

వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నిర్మించనున్న 39 కొత్త ఎస్టీపీలు పూర్తయితే, మూసీలోకి ప్రవహిస్తున్న ప్రతి మురుగునీటి చుక్కను వంద శాతం శుద్ధి చేయడం సాధ్యమవుతుంది. ఈ సమగ్ర ప్రక్షాళన చర్యలతో మూసీ నదిలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేసి, పరిసర ప్రాంతాలను అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

సాధారణ ఎస్టీపీలతో పోలిస్తే ఈ యూజీ ఎస్టీపీలను అతి తక్కువ స్థలంలో నిర్మించవచ్చని, దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో భూమి లభ్యత లేని చోట ఇప్పటికే ఇలాంటివి విజయవంతంగా నడుస్తున్నాయని ఎంఆర్‌‌‌‌డీసీఎల్ (మూసీ రివర్‌‌‌‌ఫ్రంట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ పని చేస్తున్న సమయంలో ఎలాంటి శబ్దం కానీ, దుర్వాసన కానీ రాదని, శుద్ధి చేసిన నీరు పునర్వినియోగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.